- ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి ప్రణాళికల తయారి
- గ్రామసభల ఆమోదంతో పనుల నిర్వహణ- ఎంపీడీవో పద్మ
కారేపల్లి, మహ:వీబీజీ రామ్ జి కింద వికాసిత్ గ్రామపంచాయతీ ప్లానింగ్ లో చేపట్టబోయే పనులు గ్రామ సభ ఆమోదంతో నిర్వహించటం జరుగుతుందని ఎంపీడీవో పద్మ తెలిపారు సింగరేణి మండలంలో వికాసిత్ గ్రామపంచాయతీ ప్లానింగ్ కార్యక్రమాన్ని ఈనెల 28 నుండి అక్టోబర్ ఒకటో తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో తెలిపారు. దీనిలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో గ్రామపంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను సిద్ధం చేయవలసి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సోషల్ మ్యాప్, రిసోర్స్ మ్యాప్ తయారు చేసి, గ్రామంలోని సహజ వనరులు, మౌలిక సదుపాయాలు, ప్రజల అవసరాలు, గ్రామంలోని సమస్యలను గుర్తించాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ శాఖ, పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమ శాఖ, నీటిపారుదల శాఖల ద్వారా అమలు చేయగల పనులు, గ్రామ అవసరాలు, అందుబాటులో ఉన్న వనరులను పరిశీలించి గ్రామానికి ఉపయోగకరమైన పనులను గుర్తించి ప్రణాళికలో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమాన్ని సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్స్, సంబంధిత శాఖల అధికారులు, గ్రామ ప్రజల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించాలని కోరారు. గుర్తించిన అన్ని పనుల వివరాలను సిద్ధం చేసి, 02.10.2026న నిర్వహించనున్న గ్రామసభలో ప్రవేశపెట్టి, గ్రామసభ ఆమోదం తప్పనిసరిగా పొందాలని సూచించారు.







