Mahaa Daily Exclusive

  యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి..

Share

  • యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
  • వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్, ఎంజీఎం మహా ;

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో నిర్వహించిన “నశా ముక్త్ యువ – వికసిత్ భారత్” 100 వారాల నశా ముక్త్ యువ అభియాన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య, అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజి రెడ్డి, ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, ఎన్‌ఐటీ వరంగల్ ప్రొఫెసర్ వెంకన్న తదితరుల ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల పై విద్యార్థులు, యువతలో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

యోగ, ధ్యానంతో మానసిక ప్రశాంతత

ప్రతి ఒక్కరూ నిత్యం యోగ సాధన, ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు సత్ప్రవర్తనను అలవర్చుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
ముఖ్యంగా వ్యసనం మనిషిని క్రమంగా బానిసగా మారుస్తుందని, దానికి లోనుకాకుండా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.

యువత విద్య, క్రీడల్లో రాణించాలి

మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా ప్రతి ఒక్కరూ తమకు తామే బాధ్యత వహించడంతో పాటు, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి విద్యార్థులను కూడా చైతన్య పరచాలని కలెక్టర్ సూచించారు.
యువత తమ శక్తి, సామర్థ్యాలను విద్య, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి, సమాజ సేవ వంటి సానుకూల కార్యక్రమాల వైపు మళ్లించాలని అన్నారు.
మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి ప్రభుత్వ శాఖలతో పాటు విద్యాసంస్థలు, వైద్యులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలని ఆమె పేర్కొన్నారు.

ప్రతి ఒక్కరు మరొక్కరితో పోచుకోనుండా.. మన సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
కార్యక్రమంలో భాగంగా వాల్ పోస్టర్ రిలీజ్ తో పాటు ప్రతి ఒక్కరి తో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఏం జి యం డాక్టర్లు, అధికారులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.