Mahaa Daily Exclusive

  ప్రముఖ దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఇంట తీవ్ర విషాదం…సతీమణి దీప్తి రెడ్డి హఠాన్మరణం.

Share

ప్రముఖ దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఇంట తీవ్ర విషాదం.
హైదరాబాద్, మహా.
టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి, ప్రముఖ మహిళా పారిశ్రామికవేత్త దీప్తి రెడ్డి మాడుగుల హఠాన్మరణం చెందారు. గత కొద్ది రోజులుగా తీవ్ర ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న ఆమె శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషాద ఘటనతో ప్రదీప్ అద్వైతంతో పాటు వారి ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. దీప్తి రెడ్డి అకాల మరణవార్త తెలుసుకున్న సినీ, వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పిస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులు, దర్శకులు, నిర్మాతలు ప్రదీప్ కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు రోజుల క్రితం దీప్తి రెడ్డి అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆమెను గచ్చిబౌలిలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో నిపుణులైన వైద్య బృందం ఆమెకు అత్యవసర శస్త్ర చికిత్స అందించి, ప్రాణాలు కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం దీప్తి తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె భౌతికకాయానికి ఆదివారం హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా, ప్రదీప్ అద్వైతం కెరీర్ తొలినాళ్లలో తెరకెక్కించిన ‘అద్వైతం’ షార్ట్ ఫిల్మ్ జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలిచి ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పటినుంచి ఆయన ‘ప్రదీప్ అద్వైతం’గా స్థిరపడ్డారు. ఆ తర్వాత ఆయన ‘బిల్లా రంగా’, ‘మైనే ప్యార్ కియా’ వంటి చిత్రాలతో సిల్వర్ స్క్రీన్‌పై దర్శకుడిగా సత్తా చాటారు. ముఖ్యంగా వైజయంతీ మూవీస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ప్రదీప్ తెరకెక్కించిన ‘ఛాంపియన్’ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. పీరియాడికల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలతో పాటు సినీ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. మరోవైపు ఆయన భార్య దీప్తి రెడ్డి సైతం వ్యాపార రంగంలో అడుగుపెట్టి విజయవంతమైన మహిళా పారిశ్రామికవేత్తగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె అకాల మరణం ఆ కుటుంబానికి తీరని లోటును మిగిల్చింది.