Mahaa Daily Exclusive

  ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. దేశ సంకల్పానికి నిదర్శనం…

Share

ఉగ్రవాదంపై ఉక్కుపాదం.. దేశ సంకల్పానికి నిదర్శనం.
• ఆత్మనిర్భర్‌ భారత్‌తోనే గ్రామీణ సాధికారత.
• ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’ సందేశాలపై బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి.

హైదరాబాద్, మహా.

ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానంతో ఉక్కుపాదం మోపుతోందని, ఇది నవ భారత దృఢ సంకల్పానికి నిదర్శనమని మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ జాతీయ నాయకుడు, తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల మాజీ కో ఇన్చార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవులలో గల పోలింగ్ బూత్ 143 వద్ద తన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ 138వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ సందేశాలను కొనియాడారు.
దేశ భద్రత విషయంలో మోదీ సర్కార్ ఎక్కడా రాజీపడటం లేదన్నారు. ముంబై 26/11 దాడులు, వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడుల బాధితులను స్మరించుకుంటూనే.. సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ వంటి సాహసోపేత చర్యల ద్వారా ఉగ్రవాదులకు భారత్ దీటైన సమాధానం ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.
స్థానిక ఉత్పత్తులకు పెద్దపీట
గ్రామీణ స్థాయిలో రైతులు, మహిళల ఆర్థిక సాధికారత కోసం ప్రధాని ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారని సుధాకర్ రెడ్డి ప్రశంసించారు. ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని పెంచేలా మునగ ఆకుల విశిష్టతను వివరిస్తూ చేపట్టిన “హర్ ఘర్ ముంగా – ఘర్ ఘర్ ముంగా” కార్యక్రమం ఎంతో అభినందనీయమన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంలో భాగంగా ‘వోకల్ ఫర్ లోకల్’, ‘వన్ డిస్ట్రిక్ట్ , వన్ ప్రొడక్ట్ వంటి పథకాలు స్థానిక కళాకారులు, కుటీర పరిశ్రమలు, రైతులు, చిన్న వ్యాపారులకు ఎంతో దన్నుగా నిలుస్తున్నాయని చెప్పారు.
ప్రజా భాగస్వామ్యంతోనే ‘వికసిత్ భారత్’
పర్యావరణ సంరక్షణ, భారతీయ వారసత్వ సంపద పరిరక్షణ, యువతను మాదకద్రవ్యాలకు దూరంగా ఉంచడం, గ్రామీణ క్రీడల ప్రోత్సాహం, మహిళా సంఘాల బలోపేతం వంటి కీలక అంశాలను ‘మన్ కీ బాత్’ వేదికగా ప్రధాని చర్చించడం పరిపాలనలో ప్రజా భాగస్వామ్యానికి అద్దం పడుతోందన్నారు. ప్రజలందరి సమష్టి కృషితోనే ‘వికసిత్ భారత్’ సాకారం అవుతుందని, మోదీ ప్రసంగాలు ప్రతి పౌరుడిలో దేశభక్తిని, సామాజిక బాధ్యతను రగిలిస్తున్నాయని డాక్టర్ సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు.