Mahaa Daily Exclusive

  సీఈసీ రాజీనామా చేయాల్సిందే…

Share

  • సీఈసీ రాజీనామా చేయాల్సిందే
  • ఈసీ ప్రెస్ నోట్‌పై కాంగ్రెస్ ఫైర్
  • ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని పట్టు

ఢిల్లీ, మహా
భారత ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఆయనపై విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఓటర్ల జాబితా సవరణ పేరుతో దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఓటర్ల పేర్లను తొలగించే భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించింది. ఈ సవరణ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని కాంగ్రెస్ పార్టీ శనివారం గట్టిగా పట్టుబట్టింది. ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు ఉన్నాయంటూ మీడియాలో వచ్చిన కథనాల నేపథ్యంలో, ఈసీఐ నేడు ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఈ వివరణ కాంగ్రెస్ ఆగ్రహాన్ని మరింత పెంచింది. ఈసీఐ ఇప్పుడు ఆత్మరక్షణలో పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ జైరాం రమేశ్ విమర్శించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా వరుస పోస్టులతో ఈసీఐని, సీఈసీని లక్ష్యంగా చేసుకుని పలు ప్రశ్నలు సంధించారు. “మీడియా కథనాల్లో వచ్చిన ఆరోపణలను ఈసీఐ తన ప్రెస్ నోట్‌లో ఎక్కడా నేరుగా ఖండించలేదు. వాటి తీవ్రతను తగ్గించే ప్రయత్నం మాత్రమే చేసింది. గోవా విషయంలో తప్పు చేసి దొరికిపోయాక, తొలగించిన 97 మందిలో 81 మంది పేర్లను తిరిగి చేర్చామని సిగ్గులేకుండా చెబుతోంది. అంటే, మొదట ఓటర్ల హక్కును కాలరాసి, దొరికిపోయాక మళ్లీ వారి పేర్లను చేర్చుతున్నామని చెప్పడం ఎంతవరకు సమంజసం?” అని జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఓటరు నమోదు గడువును పొడిగించిన ఈసీఐ.. కర్ణాటక, తెలంగాణ, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అన్యాయంగా ఓటు హక్కు కోల్పోయిన వారి పరిస్థితి ఏంటని నిలదీశారు. కేవలం ఒక వ్యక్తి అవినీతి వల్ల ఓటు హక్కు కోల్పోయిన ఈ రాష్ట్రాల ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీఐకి లేదా అని ఆయన అన్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఐఐటీ/ట్రిపుల్ ఐటీ నిపుణులతో ఈసీనెట్ పోర్టల్‌ను సమీక్షిస్తామని చెప్పడం, సమస్య ఉందని అంగీకరించడమేనని జైరాం రమేశ్ పేర్కొన్నారు. సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు, ప్రతిపక్షాలపై ద్వేషం, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించడం, ముఖ్యంగా యువ ఓటర్లను (జెన్ Z) లక్ష్యంగా చేసుకోవడం వంటి అంశాలు ఆయన అవినీతిని బయటపెట్టాయని ఆరోపించారు. ఫారం 6లో పార్లమెంటు ఆమోదం లేకుండా మార్పులు చేసి, యువత ఓటు నమోదు చేసుకోకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సీఈసీ బ్యూరోక్రసీ ముసుగులో దాక్కోవాలని చూస్తున్నారని, కానీ ఆయన బండారం బట్టబయలైందని జైరాం రమేశ్ అన్నారు. దేశమంతా ఆయనను జవాబుదారీ చేయాలని చూస్తోందని, ఈ నేపథ్యంలో సీఈసీ రాజీనామా లేదా ఆయనపై విచారణ జరపడం మినహా మరో మార్గం లేదని స్పష్టం చేశారు.