- గణేష్ నిమజ్జనాల్లో 13 మంది మృతి
- 26 మందికి గాయాలు
- డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడి
హైదరాబాద్, మహా : తెలంగాణలో వినాయక నిమజ్జన వేడుకల సందర్భంగా పలుచోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ విషయం పై డిజిపి సివి ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు. వినాయక నిమజ్జన బందోబస్తులో ఉన్న ఎస్సై ప్రమాదంలో మృతి చెందగా పటాన్ చెరువులో ఆరుగురు, ఖైరతాబాద్, నిర్మల్ లలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా డీజే సౌండ్స్ తో గుండెపోటుకు గురై మరో వ్యక్తి మృతి చెందారు. నిమజ్జనాలలో 13 మంది మృతి చెందడం బాధాకరమని మీడియాతో డీజీపీ అన్నారు. నిమజ్జనాలలో మొత్తం 26 మంది గాయపడగా ఒక్క మల్కాజిగిలోనే 16 మందికి గాయాలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరు విడతల్లో నిమజ్జనాలు జరుగగా హైదరాబాదులో గణేష్ నిమజ్జనాల విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా వినాయక నిమజ్జన కార్యక్రమాలు అత్యంత భద్రత వాతావరణంలో కొనసాగాయి. ఐసీసీసి, డిజిపి కార్యాలయం నుంచి నిమజ్జన ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించినట్లు డిజిపి ఆనంద్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జియో టాకింగ్ సంబంధిత పోర్టల్ లో నమోదైన సమాచారం ప్రకారం ఈ ఏడాది పబ్లిక్ ప్లేస్లలో 1.24 లక్షల వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసినట్లు గుర్తించామని డిజిపి తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 8 వేల విగ్రహాలు అదనంగా ఏర్పాటైనట్లు ఆయన చెప్పారు. హైదరాబాదులో నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ విస్తృత భద్రత ఏర్పాట్లు చేపట్టిందని డీజిపి తెలిపారు.







