Mahaa Daily Exclusive

  జూరాల రైతుల కోసం…

Share

  • జూరాల రైతుల కోసం
  • కర్నాటక సీఎంతో రాష్ట్ర మంత్రుల భేటీ
  • సీఎంతో భేటీ అయిన మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి
  • అలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి వీటి విడుదల వేగం పెంచేందుకు ప్రయత్నం

హైదరాబాద్, మహా : జూరాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమైంది. కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి జూరాలకు నీటి ప్రవాహం పెంచేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బెంగళూరుకు వెళ్లి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో సమావేశం కానుంది. ఇటీవల జూరాల నీటి విడుదల, ఆయకట్టు రైతుల పంటల పరిస్థితిపై ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సమావేశం అయ్యారు. నీటి లభ్యత, పంటలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కర్ణాటక నుంచి వచ్చే ప్రవాహాన్ని పెంచే అవకాశాలపై ఆ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. అనంతరం కర్ణాటక ప్రభుత్వంతో నేరుగా సంప్రదింపులు జరపాలని నిర్ణయించారు.

ఈ బృందంలో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జి. మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి జూరాల వైపు నీటి ప్రవాహాన్ని పెంచాలని కర్ణాటక ముఖ్యమంత్రిని మంత్రులు, ఎమ్మెల్యేల బృందం కోరనుంది. ప్రస్తుతం పంటలకు అవసరమైన నీటిని దశలవారీగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణపై దృష్టి పెట్టింది. జూరాల నీటి సమస్యపై ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. జూరాల నుంచి ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్ చేశారు. నీరు అందక పంటలు దెబ్బతినే పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు.

జడ్చర్ల వద్ద బీజేపీ అధ్యక్షుడి అరెస్టు

మరోవైపు.. జూరాల ప్రాజెక్టును సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్‌. రామ్‌చందర్‌రావును జడ్చర్ల వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పలువురు బీజేపీ నేతలను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. రామ్‌చందర్‌రావు జూరాలకు వెళ్లి రైతులను కలవనున్నట్లు ముందుగానే ప్రకటించడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. రామ్‌చందర్‌రావు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో బీజేపీ కార్యకర్తలు జడ్చర్ల వద్ద హైదరాబాద్‌-బెంగళూరు నేషనల్ హైవేపై ఆందోళనకు దిగారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతుల సమస్యలను ప్రస్తావించేందుకు వెళ్తున్న తమ పార్టీ నేతలను ఎందుకు అడ్డుకుంటున్నారని బీజేపీ నేతలు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రామ్‌చందర్‌రావు అరెస్టుపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పందిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఇదిలా ఉంటే.. జూరాల వద్ద నీటి లభ్యత, సాగునీటి విడుదలపై ప్రభుత్వం-ప్రతిపక్షాల మధ్య తీవ్ర రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి. కర్ణాటక నుంచి వచ్చే నీటి ప్రవాహం కూడా ఈ వ్యవహారంలో కీలకంగా మారింది. గతంలో ఆల్మట్టి, నారాయణపూర్‌ నుంచి వచ్చే ప్రవాహాలు తగ్గడంతో జూరాల నీటి పరిస్థితిపై ప్రభావం పడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కర్ణాటక సర్కార్‌తో చర్చల ద్వారా జూరాలకు అదనపు నీటి ప్రవాహం సాధించే ప్రయత్నం తెలంగాణ ప్రభుత్వం చేస్తుండగా.. మరోవైపు రైతులు పంటలను కాపాడేందుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో బెంగళూరులో డీకే శివకుమార్‌తో జరగనున్న తెలంగాణ మంత్రుల సమావేశం.. కర్ణాటక ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనపై జూరాల ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.