తమిళనాడు అసెంబ్లీలో ‘దవడ’ దుమారం!
• అవును.. నా దవడ విరిగింది.
• విజయ్‌కు స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.
• అసెంబ్లీని సినిమా షూటింగ్ స్పాట్‌గా మార్చొద్దు.
• డీఎంకే అధినేత ఘాటు వ్యాఖ్యలు
చెన్నై, మహా.
“తమ్ముడూ విజయ్.. నువ్వు చేసిన సంజ్ఞ నిజమే. అవును.. నా దవడ విరిగింది.” తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చేసిన ఓ సంజ్ఞపై చెలరేగిన వివాదానికి డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాజాగా వీడియో ద్వారా ఘాటుగా స్పందించారు. తనపై జరిగిన దాడి, ఎమర్జెన్సీ నాటి జైలు అనుభవాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు.
సెప్టెంబర్ 7న పోలీసు శాఖ నిధులపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా సీఎం విజయ్ డీఎంకేపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ సమయంలో ఎంకే స్టాలిన్ అరెస్టు, మిసా చట్టం గురించి ప్రస్తావిస్తూ తన దవడను చేత్తో పట్టుకుని సంజ్ఞ చేశారు. అయితే ఈ సంజ్ఞపై డీఎంకే, వామపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎమర్జెన్సీ కాలంలో జైలులో పోలీసుల దాడిలో స్టాలిన్ దవడ ఎముకలు విరిగిన ఘటనను ఉద్దేశపూర్వకంగా ఎద్దేవా చేస్తూ విజయ్ బాడీ షేమింగ్‌కు పాల్పడ్డారని విమర్శలు వెల్లువెత్తాయి.
వివాదం తీవ్రరూపం దాల్చడంతో విజయ్ వివరణ ఇచ్చారు. ఆ సంజ్ఞ అనుకోకుండా జరిగిందని, ఎవరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. అయితే తాజాగా స్టాలిన్ విడుదల చేసిన వీడియోతో ఈ వివాదం మరోసారి రాజకీయంగా వేడెక్కింది.
“1976 జనవరి 31న ఇందిరాగాంధీ ప్రభుత్వం కలైంజ్ఞర్ కరుణానిధి ప్రభుత్వాన్ని రద్దు చేసిన వెంటనే పోలీసులు గోపాలపురంలోని మా ఇంటికి వచ్చారు. నన్ను మిసా చట్టం కింద అరెస్టు చేశారు. మద్రాస్ సెంట్రల్ జైలులో మమ్మల్ని కుష్టు రోగుల వార్డులో ఉంచారు. రాత్రిళ్లు తన్నేవారు.. కొట్టేవారు. అదే దాడిలో నా దవడ ఎముకలు విరిగాయి. ఇప్పటికీ ఆ గాయాల మచ్చలు నా శరీరంపై ఉన్నాయి” అంటూ స్టాలిన్ తన గతాన్ని గుర్తుచేసుకున్నారు.
ఆ సమయంలో తన సహచరుడు చిట్టిబాబు కూడా మృతి చెందారని స్టాలిన్ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో తాను ఎదుర్కొన్న హింసను రాజకీయ ఎద్దేవాకు ఉపయోగించవద్దని పరోక్షంగా విజయ్‌కు సూచించారు.
ఇదే సమయంలో విజయ్‌తో గతంలో జరిగిన వ్యక్తిగత భేటీని కూడా స్టాలిన్ ప్రస్తావించారు. “ఇంట్లో నన్ను కలిసినప్పుడు చెప్పిన మాట మర్చిపోయావా తమ్ముడు విజయ్?” అంటూ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచార సమయంలో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసినందుకు విజయ్ చింతిస్తున్నానని చెప్పి తన చేతులు పట్టుకున్నారని, తాను కూడా ఆ విషయాన్ని మనసులో పెట్టుకోలేదని స్టాలిన్ తెలిపారు. ఇతరులపై వ్యాఖ్యలు చేసేటప్పుడు హుందాతనం పాటించాలని అప్పుడే సూచించినట్లు వెల్లడించారు.
“నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాలి.. ప్రవర్తించాలి. అసెంబ్లీని సినిమా షూటింగ్ స్పాట్‌లా, రీల్స్ చేసే ప్రదేశంలా మార్చకు” అంటూ విజయ్‌పై స్టాలిన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అసెంబ్లీ గౌరవాన్ని, సభా సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు.
మరోవైపు సర్కారియా కమిషన్ పేరుతో కరుణానిధిపై చేస్తున్న అవినీతి ఆరోపణలను కూడా స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షతోనే అప్పట్లో కరుణానిధిపై ఆ ఆరోపణలు సృష్టించారని, వాటిలో వాస్తవం లేదని ఆయన పేర్కొన్నారు.
దీంతో తమిళనాడు రాజకీయాల్లో ఇప్పటికే వేడెక్కిన విజయ్–డీఎంకే పోరు మరింత ముదిరినట్లయింది. అసెంబ్లీలో జరిగిన ఒక్క సంజ్ఞ చుట్టూ మొదలైన వివాదం.. ఇప్పుడు ఎమర్జెన్సీ చరిత్ర, రాజకీయ ఆరోపణలు, వ్యక్తిగత విమర్శల వరకు చేరుకోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది.







