Mahaa Daily Exclusive

  ప్రియాంక గాంధీ పేరుతో డీప్‌ఫేక్‌ వీడియోలు…

Share

ప్రియాంక గాంధీ పేరుతో డీప్‌ఫేక్‌ వీడియోలు.
• డబ్బులు పెట్టుబడి పెట్టొద్దు.. అవన్నీ స్కామ్‌లే.
• ఫేక్‌ వీడియోలు కనిపిస్తే వెంటనే బ్లాక్‌ చేసి రిపోర్ట్‌ చేయండి.
• ప్రియాంక కార్యాలయం

న్యూఢిల్లీ,మహా.

కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా పేరుతో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్న నకిలీ డీప్‌ఫేక్‌ వీడియోలపై ఆమె కార్యాలయం ప్రజలను అప్రమత్తం చేసింది. ప్రియాంక గాంధీ ముఖం, గొంతును కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతతో అనుకరించి రూపొందించిన వీడియోలను వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సహా పలు సోషల్‌ మీడియా వేదికల్లో ప్రచారం చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి వీడియోలను నమ్మి ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరించింది.

ఇటీవల వైరల్‌ అవుతున్న కొన్ని వీడియోల్లో ప్రియాంక గాంధీ రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు, భవిష్యత్‌ పెట్టుబడి పథకాల్లో డబ్బులు పెట్టాలని ప్రజలను కోరుతున్నట్లుగా చూపిస్తున్నారని ఆమె కార్యాలయం వెల్లడించింది. అయితే ఆ వీడియోలకు ప్రియాంక గాంధీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఏఐ సాంకేతికతను ఉపయోగించి ఆమె ఫొటోలు, గొంతును నకిలీగా సృష్టించి ప్రజలను మోసం చేసేందుకు ఈ వీడియోలను తయారు చేస్తున్నారని తెలిపింది.

“ప్రియాంక గాంధీ వాద్రా గారి ఏఐ జనరేటెడ్‌ ఫొటోలు, వాయిస్‌తో ఫేక్‌ వీడియోలు సర్క్యులేట్‌ అవుతున్నాయి. డబ్బులు ఇన్వెస్ట్‌ చేయమని కోరుతున్నాయి. ఇవన్నీ స్కామ్‌లు. దయచేసి క్లిక్‌ చేయవద్దు.. ఇన్వెస్ట్‌ చేయవద్దు” అని ప్రియాంక కార్యాలయం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా స్పష్టం చేసింది.

సోషల్‌ మీడియాలో ఇలాంటి వీడియోలు, పోస్టులు కనిపిస్తే వాటిని ఫార్వర్డ్‌ చేయకుండా వెంటనే బ్లాక్‌ చేయడంతో పాటు సంబంధిత అధికారులకు రిపోర్ట్‌ చేయాలని సూచించింది. అనుమానాస్పద లింకులపై క్లిక్‌ చేయవద్దని, వ్యక్తిగత లేదా బ్యాంకింగ్‌ వివరాలను ఎవరికీ అందించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

ప్రముఖుల ఫొటోలు, గొంతులను ఏఐ సాంకేతికతతో అనుకరించి నకిలీ వీడియోలు రూపొందించడం ద్వారా ప్రజలను నమ్మించి డబ్బులు వసూలు చేసే మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రముఖ వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా కనిపించినంత మాత్రాన వీడియో నిజమైనదని భావించకుండా, పెట్టుబడులకు సంబంధించిన సమాచారాన్ని అధికారిక వేదికల్లో ధ్రువీకరించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.