37 ఏళ్ల తర్వాత మళ్లీ విద్యార్థి సంఘాల ఎన్నికలు.
* కర్ణాటక ప్రభుత్వ కీలక నిర్ణయం.
* క్యాంపస్‌లలో ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి.
* రాజకీయ పార్టీలకు నో ఎంట్రీ.
* ఈ విద్యా సంవత్సరం నుంచే ఎన్నికలు.
* అధ్యక్షుడితో పాటు మహిళలకు కీలక పదవులు.
బెంగళూరు,మహా:
దాదాపు 37 ఏళ్లుగా అమలులో ఉన్న నిషేధానికి తెరదించుతూ కర్ణాటక ప్రభుత్వం కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలను పునరుద్ధరించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయానికి ఆమోదం లభించింది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యత, ప్రజాస్వామ్య విలువలను పెంపొందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర తెలిపారు.
క్యాంపస్‌లలో హింస, ఘర్షణలు, రాజకీయ జోక్యం పెరగడంతో 1989లో అప్పటి వీరేంద్ర పాటిల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి సంఘాల ఎన్నికలను నిషేధించింది. ఆ తర్వాత విద్యార్థి రాజకీయాలపై ఆంక్షలు కొనసాగాయి. దాదాపు నాలుగు దశాబ్దాల విరామం అనంతరం ఇప్పుడు మళ్లీ ఎన్నికలకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది.
‘‘విద్యార్థి ఎన్నికలను తిరిగి ప్రవేశపెడుతున్నాం’’ అని మంత్రివర్గ సమావేశం అనంతరం పరమేశ్వర వెల్లడించారు. అయితే క్యాంపస్‌లలో రాజకీయ పార్టీల ప్రత్యక్ష జోక్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. విద్యార్థులు తమ కళాశాల పరిధిలో స్వతంత్రంగా పోటీ చేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు లేదా వాటి అనుబంధ విద్యార్థి సంఘాల పేరుతో ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రచారం నిర్వహించడం అనుమతించబోరు.
విద్యార్థి సంఘాల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేక విధానాన్ని ప్రతిపాదించింది. ప్రతి కళాశాలలో ఒక అధ్యక్షుడు, ఇద్దరు ఉపాధ్యక్షులు, ఒక ప్రధాన కార్యదర్శి, ఇద్దరు సంయుక్త కార్యదర్శులతో పాటు ఆరుగురు సభ్యులతో కార్యవర్గం ఉండనుంది. ఇద్దరు ఉపాధ్యక్షుల్లో ఒకరు మహిళ అయి ఉండాలి. సంయుక్త కార్యదర్శుల్లో ఒక పదవి మహిళకు కేటాయించనున్నారు. కార్యవర్గంలోని ఆరుగురిలో ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించనున్నారు.
ఈ ఎన్నికల్లో కుల ఆధారిత రిజర్వేషన్లు ఉండవని ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యార్థి సంఘాల ఎన్నికలను కుల, రాజకీయ ప్రాతిపదికన కాకుండా విద్యార్థుల నాయకత్వం, ప్రతిభ, ప్రజాస్వామ్య భాగస్వామ్యానికి వేదికగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఉద్దేశంగా అధికారులు చెబుతున్నారు.
అయితే ఎన్నికలు ప్రతి కళాశాలలో తప్పనిసరిగా నిర్వహించాలా? అనే అంశంలోనూ ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించాలనే ఆసక్తి లేకపోతే అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదని పరమేశ్వర తెలిపారు. విద్యార్థుల అభిప్రాయానికే ప్రాధాన్యం ఉంటుందని, కేవలం కళాశాల యాజమాన్యం నిర్ణయం ఆధారంగా ఎన్నికలు నిర్వహించడం లేదా నిలిపివేయడం ఉండదని వివరించారు.
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి ప్రతినిధుల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. అయితే ఎన్నికలు ఎప్పుడు, ఏ విధానంలో నిర్వహించాలి? ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉండాలి? వంటి పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం తదుపరి దశలో ఖరారు చేయనుంది.
విద్యార్థి సంఘాల ఎన్నికలను పునరుద్ధరించడం వెనుక యువతలో నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం చెబుతోంది. భవిష్యత్‌లో ప్రజా జీవితంలోకి వచ్చే యువతకు విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య ప్రక్రియ, బాధ్యత, చర్చ, నిర్ణయాధికారం వంటి అంశాలపై అవగాహన కల్పించాలన్న లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం 2026–27 బడ్జెట్‌లోనే విద్యార్థి సంఘాల ఎన్నికలను పునరుద్ధరించే ప్రతిపాదనను ప్రకటించింది.
గతంలో విద్యార్థి సంఘాల ఎన్నికలు రాజకీయ జోక్యం, హింస, బలప్రయోగానికి వేదికగా మారిన నేపథ్యంలో ఈసారి ప్రభుత్వం కఠిన నిబంధనలతో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. బయటి వ్యక్తులు క్యాంపస్‌లోకి వచ్చి ప్రచారం చేయకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, ఏ రాజకీయ పార్టీ లేదా విద్యార్థి సంస్థ పేరుతోనూ అభ్యర్థులు పోటీ చేయకుండా నియంత్రణలు విధించనున్నారు.







