ఇళయరాజాకు మరోసారి ఢిల్లీ హైకోర్టులో షాక్.
• 134 సినిమాల పాటలపై నిషేధం కొనసాగింపు.
• సరేగమకు అనుకూలంగా కీలక ఉత్తర్వులు.
• ఆన్‌లైన్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో పాటలను వినియోగించొద్దు.
• ఇళయరాజా పిటిషన్‌కు ఎదురుదెబ్బ.
న్యూఢిల్లీ,మహా.
ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యాస్ట్రో ఇళయరాజాకు కాపీరైట్ వివాదంలో ఢిల్లీ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సరేగమ ఇండియా దాఖలు చేసిన కాపీరైట్ కేసులో గతంలో విధించిన మధ్యంతర నిషేధాన్ని ఎత్తివేయడానికి కోర్టు నిరాకరించింది. దీంతో 134 సినిమాలకు సంబంధించిన పాటలను ఆన్‌లైన్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌లలో ఇళయరాజా వినియోగించడంపై విధించిన ఆంక్షలు కొనసాగనున్నాయి.
సరేగమ ఇండియా వాదన ప్రకారం.. 1976 నుంచి 2001 మధ్య వివిధ చిత్రాల నిర్మాతలతో కుదుర్చుకున్న అసైన్‌మెంట్ ఒప్పందాల ద్వారా ఆయా సినిమాల్లోని సౌండ్ రికార్డింగ్స్, సాహిత్య, సంగీత రచనలకు సంబంధించిన కాపీరైట్ తమకు సంక్రమించిందని పేర్కొంది. 134 చిత్రాలకు సంబంధించిన ఈ హక్కుల ఆధారంగానే ఇళయరాజాపై న్యాయపోరాటం చేస్తోంది.
2026 ఫిబ్రవరిలో సరేగమ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ తుషార్ రావు గెడేలా ఇళయరాజాపై ఎక్స్‌పార్టీ యాడ్ ఇంటరిమ్ ఇంజంక్షన్ విధించారు. అమెజాన్ మ్యూజిక్, ఆపిల్ ఐట్యూన్స్, జియోసావన్ వంటి వేదికల్లో ఆయా పాటలను వినియోగించడం, లైసెన్సులు ఇవ్వడం, వాటిపై యాజమాన్య హక్కులు ప్రకటించుకోవడాన్ని నిరోధించారు. సరేగమకు ప్రాథమికంగా బలమైన కేసు ఉందని కోర్టు అప్పట్లో పేర్కొంది.
అయితే ఈ ఆదేశాలను ఎత్తివేయాలని ఇళయరాజా కోర్టును కోరారు. తాను కేవలం సంగీత దర్శకుడే కాకుండా సంబంధిత సంగీత రచనలకు హక్కుదారునని, కొన్ని అసైన్‌మెంట్ ఒప్పందాలు పాత కాలంలో ఉన్న మాధ్యమాలకే పరిమితమయ్యాయని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. ఆన్‌లైన్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా జరిగే వినియోగం అప్పటి ఒప్పందాల్లో ఊహించలేదని కూడా వాదించారు.
ఈ వాదనలను పరిశీలించిన అనంతరం జూలై 1, 2026న ఢిల్లీ హైకోర్టు ఇళయరాజా కోరిన మధ్యంతర ఉపశమనాన్ని నిరాకరించింది. సరేగమ దాఖలు చేసిన మధ్యంతర నిషేధ పిటిషన్‌ను అనుమతిస్తూ, ఇళయరాజా దాఖలు చేసిన నిషేధం ఎత్తివేత పిటిషన్‌ను కొట్టివేసింది. కేసు తుది విచారణలో హక్కులపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని కోర్టు స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంలో సంగీత కూర్పు, సాహిత్యం, సౌండ్ రికార్డింగ్ హక్కులు వేర్వేరు కాపీరైట్ హక్కులుగా ఉండవచ్చని ఢిల్లీ హైకోర్టు గతంలోనూ స్పష్టం చేసింది. ఇళయరాజా స్వయంగా రూపొందించిన సంగీత కూర్పుపై ఉన్న హక్కులు, సినిమా కోసం రూపొందించిన సౌండ్ రికార్డింగ్‌పై ఉండే హక్కులు ఒకటే కాదన్న అంశమే ఈ వివాదంలో కీలకంగా మారింది.
134 చిత్రాల జాబితాలో ఇళయరాజా సంగీతం అందించిన అనేక ప్రముఖ చిత్రాలు ఉన్నాయి. ఈ వివాదం కేవలం ఒకటి రెండు పాటలకు పరిమితం కాకుండా ఆయన కెరీర్‌లోని భారీ సంఖ్యలో చిత్రాల సంగీత హక్కులకు సంబంధించినదిగా మారడంతో సినీ, సంగీత పరిశ్రమలో ఆసక్తి నెలకొంది.
అయితే ఇది ఇళయరాజా కాపీరైట్ హక్కులపై తుది తీర్పు కాదు. ప్రస్తుతం అమల్లో ఉన్నది మధ్యంతర నిషేధం మాత్రమే. కేసు తుది విచారణలో ఇరు పక్షాల ఒప్పందాలు, కాపీరైట్ హక్కులు, సౌండ్ రికార్డింగ్స్‌పై యాజమాన్య హక్కుల అంశాలను కోర్టు పూర్తిగా పరిశీలించాల్సి ఉంది. తదుపరి విచారణను ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 29, 2026కు జాబితా చేసింది.







