ముంబై–గోవా రహదారి జాప్యంపై గడ్కరీ ఫైర్.
• ఇంత ఆలస్యం సిగ్గుచేటు.. అందుకే ప్రారంభోత్సవానికి రాను.
• కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు.. బ్లాక్‌లిస్ట్, సస్పెన్షన్లకు హెచ్చరిక.
ఢిల్లీ, మహా.
పనులు ఇంతకాలం సాగడం సిగ్గుచేటు.. అందుకే ముంబై–గోవా రహదారి ప్రారంభోత్సవానికి తాను హాజరుకానని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. పనుల్లో నిర్లక్ష్యం, నాణ్యతా లోపాలకు బాధ్యులైన కాంట్రాక్టర్లు, అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
గోవా: గోవాలోని పోర్వోరిమ్ వద్ద ఆరు వరుసల ఎలివేటెడ్ కారిడార్‌ను ప్రారంభించిన అనంతరం గడ్కరీ మాట్లాడారు. 2011లో ప్రారంభమైన 555 కిలోమీటర్ల ముంబై–గోవా జాతీయ రహదారి నాలుగు వరుసల విస్తరణ పనులు 2016 నాటికే పూర్తికావాల్సి ఉందన్నారు. అయితే ఇంతవరకు పనులు 93–94 శాతం మాత్రమే పూర్తవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ల వైఫల్యం, పనుల అమలులో నిర్లక్ష్యం కారణంగానే ప్రాజెక్టు ఇంతగా ఆలస్యమైందని పేర్కొన్నారు.
రోడ్డు నిర్మాణ పనుల్లో జాప్యం చేయడం, నాణ్యతా ప్రమాణాలను పాటించకపోవడాన్ని ఎంతమాత్రం సహించబోమని గడ్కరీ స్పష్టం చేశారు. బాధ్యులైన కాంట్రాక్టర్లతో పాటు సంబంధిత అధికారులపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏడాదిలోపు అత్యధిక సంఖ్యలో కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పాటు, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను సస్పెండ్ చేసి రికార్డు సృష్టిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
రహదారి పనుల వాస్తవ పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు అక్టోబర్‌లో ముంబైకి వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గోవా వరకు ప్రయాణిస్తానని గడ్కరీ తెలిపారు. ముంబై విమానాశ్రయంలో దిగి గోవా వరకు రహదారి మార్గంలో ప్రయాణిస్తూ పనుల నాణ్యత, రహదారి పరిస్థితిని స్వయంగా పరిశీలిస్తానన్నారు. ప్రయాణికులకు ప్రయాణం నిజంగా సౌకర్యవంతంగా మారిందా? రహదారి పనులు నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? అనే అంశాలను పరిశీలిస్తానని వెల్లడించారు.
దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి జాతీయ రహదారులు కీలకమని, ప్రజలకు మెరుగైన రహదారులు, సురక్షితమైన ప్రయాణ సౌకర్యం అందించడమే లక్ష్యమని గడ్కరీ స్పష్టం చేశారు. భారీ ప్రాజెక్టుల పేరుతో పనులను ఏళ్ల తరబడి సాగదీయడం, ప్రజలకు ఇబ్బందులు కలిగించడం ఇకపై సహించబోమన్న సంకేతాలను ఆయన వ్యాఖ్యలు ఇచ్చాయి.







