నాగబాబుకు కేబినెట్ హోదా.
• ఏపీ గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు.
• రూ.4.50 లక్షల వేతన భత్యాలు.
• పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణకు కీలక బాధ్యతలు.
అమరావతి,మహా:
జనసేన సీనియర్ నేత, శాసనమండలి సభ్యుడు కొణిదెల నాగబాబుకు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించింది. ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్మెంట్ (ఏపీ గ్రీన్) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్‌గా ఆయనను నియమించిన ప్రభుత్వం.. తాజాగా కేబినెట్ ర్యాంకుతో పాటు వేతన, భత్యాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
పర్యావరణ, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం నాగబాబుకు నెలకు రూ.2 లక్షల జీతం లభించనుంది. కార్యాలయ నిర్వహణ, వ్యక్తిగత సిబ్బంది అలవెన్సుల కింద మరో రూ.2.50 లక్షలు అందనుండటంతో మొత్తం నెలకు రూ.4.50 లక్షల మేర వేతన, భత్యాల ప్రయోజనాలు లభించనున్నాయి. ఆయన బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ వేతన భత్యాలు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
వికసిత్ ఆంధ్రప్రదేశ్–2047 లక్ష్యంలో భాగంగా రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో పచ్చదనాన్ని 50 శాతం వరకు పెంచడమే లక్ష్యంగా ఏపీ గ్రీన్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపు, అటవీ విస్తరణ, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను వేగవంతం చేయడంతో పాటు జిల్లా స్థాయిలో పనిచేసే పచ్చదనం అభివృద్ధి సంస్థల కార్యకలాపాలను సమన్వయం చేయడం కమిటీ ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం తెలిపింది.
ఏపీ గ్రీన్ కార్యక్రమాల పురోగతిని పర్యవేక్షించడం, అటవీ విస్తరణకు సంబంధించిన ప్రాజెక్టులను సమన్వయం చేయడం, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల అమలును పరిశీలించడం వంటి కీలక బాధ్యతలు ఛైర్మన్‌గా నాగబాబుపై ఉండనున్నాయి. రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ భవిష్యత్ తరాలకు పచ్చని ఆంధ్రప్రదేశ్‌ను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యంలో ఏపీ గ్రీన్ కమిటీ కీలకంగా వ్యవహరించనుంది.
నాగబాబుకు ఏపీ గ్రీన్ కమిటీ ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పగించడంతో పాటు కేబినెట్ హోదా కల్పించడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.








