గణేష్ నిమజ్జనాలకు హైడ్రా వ్యతిరేకం కాదు.
• కేంద్రం గుర్తించిన చెరువుల్లోనే ఆంక్షలు.
• దుష్ప్రచారాన్ని నమ్మొద్దు: ఏవీ రంగనాథ్.
హైదరాబాద్, మహా .
నగరంలో గణేష్ నిమజ్జనాలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. చెరువుల్లో గణేష్ నిమజ్జనాలకు హైడ్రా వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. హైడ్రాపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భక్తుల మనోభావాలను గౌరవిస్తూ నిమజ్జనాలకు అనుకూలంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన నాలుగు నుంచి ఐదు చెరువుల్లో మాత్రమే గణేష్ నిమజ్జనంపై ఆంక్షలు ఉన్నాయని రంగనాథ్ వివరించారు. అమీన్పూర్ చెరువును దేశంలోనే తొలిసారిగా బయోడైవర్సిటీ ప్రాంతంగా, కాప్రా చెరువును నేచురల్ వెట్‌ల్యాండ్ కింద కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. ఈ కారణంగానే ఆ రెండు చెరువుల్లో నిమజ్జనాలపై ఆంక్షలు ఉన్నాయని స్పష్టం చేశారు.
హైడ్రా పునరుద్ధరిస్తున్న మిగతా చెరువుల వద్ద గణేష్ నిమజ్జనాలపై ఎలాంటి ఆంక్షలు లేవని కమిషనర్ పేర్కొన్నారు. నిమజ్జనాలను అడ్డుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. భక్తులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, అధికారిక సమాచారం ఆధారంగానే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడేందుకు భక్తులు సహకరించాలని రంగనాథ్ పిలుపునిచ్చారు. పీఓపీ విగ్రహాల నిమజ్జనం కోసం ప్రతి చెరువు వద్ద ప్రత్యేక స్థలాలను కేటాయిస్తున్నామని తెలిపారు. నిమజ్జనాల సమయంలో పర్యావరణానికి నష్టం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటూనే, గణేష్ ఉత్సవాల పట్ల భక్తుల విశ్వాసాలు, మనోభావాలకు పూర్తి గౌరవం ఇస్తామని స్పష్టం చేశారు.








