Mahaa Daily Exclusive

  ఫామ్‌హౌస్‌లో ప్రముఖ రియల్టర్ బలవన్మరణం…

Share

ఫామ్‌హౌస్‌లో ప్రముఖ రియల్టర్ బలవన్మరణం.
• ఆర్థిక ఒత్తిళ్లే కారణమా?.. సూసైడ్‌ నోట్‌ స్వాధీనం.
• 250 ఎకరాల భూ ప్రాజెక్టు వివాదం.. అప్పుల భారంతో తీవ్ర మనోవేదన?

రంగారెడ్డి, మహా .

ప్రముఖ రియల్టర్‌ బనాల రామ్‌రెడ్డి ఫామ్‌హౌస్‌లో బలవన్మరణానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో విషాదం నింపింది. కందుకూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నెదునూరు గ్రామంలో ఉన్న ఆయన ఫామ్‌హౌస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా సూసైడ్‌ నోట్‌ లభించినట్లు తెలిపారు. ప్రాథమికంగా ఆర్థిక ఒత్తిళ్ల కారణంగానే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

హైదరాబాద్‌ మణికొండలో నివాసం ఉంటున్న రామ్‌రెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం నిర్వహిస్తున్నారు. 2018లో పటాన్‌చెరు ప్రాంతంలో సుమారు 250 ఎకరాల భూమిని డెవలప్‌మెంట్‌ కోసం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆ భూమికి సంబంధించి వివాదాలు, కోర్టు కేసులు తలెత్తడంతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నించిన క్రమంలో ఆయన భారీగా అప్పులు చేసినట్లు తెలుస్తోంది.

ఒకవైపు భూ యజమానులతో తలెత్తిన సమస్యలు, మరోవైపు అప్పుల ఒత్తిళ్లు కొనసాగడంతో రామ్‌రెడ్డి తీవ్ర మనోవేదనకు గురైనట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఆత్మహత్యకు అసలు కారణాలు ఏమిటన్నది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్‌ నోట్‌లోని వివరాలను కూడా పరిశీలిస్తున్నారు.

రామ్‌రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కందుకూరు సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. సూసైడ్‌ నోట్‌ వివరాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు, అప్పుల వ్యవహారాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.