Mahaa Daily Exclusive

  బంగాళాఖాతంలో ‘ఓషన్‌ విన్నర్‌’ మునక..! 24 మంది సిబ్బందిలో ఇద్దరి రక్షణ..!

Share

• 24 మంది సిబ్బందిలో ఇద్దరి రక్షణ.
• మిగిలిన 22 మంది కోసం నేవీ గాలింపు

విశాఖపట్నం, మహా.: బంగాళాఖాతంలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న భారీ సరకు నౌక ‘ఎంవీ ఓషన్‌ విన్నర్‌’ మునిగిపోవడంతో భారీ స్థాయి గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నౌకలో మొత్తం 24 మంది సిబ్బంది ఉండగా ఇద్దరిని రక్షించారు. మిగిలిన 22 మంది కోసం భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్‌ సంయుక్తంగా గాలింపు చేపడుతున్నాయి.

ఒడిశాలోని పారాదీప్‌ నుంచి ఇనుప ఖనిజంతో చైనా వైపు వెళ్తున్న నౌక నుంచి అత్యవసర సందేశం రావడంతో భారత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. అనంతరం నౌకతో సంబంధాలు తెగిపోయాయి. సముద్రంలో నౌక మునిగిపోయినట్లు నిర్ధారణ కావడంతో రెస్క్యూ ఆపరేషన్‌ను వేగవంతం చేశారు.

నౌకలో 20 మంది చైనా పౌరులు, ముగ్గురు మయన్మార్‌ పౌరులు, ఒక బంగ్లాదేశ్‌ పౌరుడు ఉన్నట్లు సమాచారం. రక్షించిన ఇద్దరికి వైద్యసాయం అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో నౌకాదళ నిఘా విమానాలు, నౌకలు, కోస్ట్‌గార్డ్‌ బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. సమీపంలోని వాణిజ్య నౌకలను కూడా సహాయక చర్యల్లో భాగస్వామ్యం చేయాలని కోరారు.

సముద్రంలో వాతావరణ పరిస్థితులు, అలల తీవ్రత, నౌక మునిగిన లోతు రెస్క్యూ ఆపరేషన్‌కు సవాలుగా మారుతున్నాయి. అయినప్పటికీ ప్రాణాలతో ఉన్నవారిని గుర్తించి రక్షించడమే ప్రధాన లక్ష్యంగా నేవీ, కోస్ట్‌గార్డ్‌ బృందాలు పనిచేస్తున్నాయి. ప్రమాదానికి అసలు కారణం ఏమిటన్నది సహాయక చర్యలు పూర్తయిన తర్వాత దర్యాప్తులో తేలనుంది.

Latest