Mahaa Daily Exclusive

  మోదీ@25’పై బీజేపీ మథనం..! దేశవ్యాప్త ప్రచారానికి ప్రణాళిక.

Share

• రాష్ట్రాల అధ్యక్షులు, ఇన్‌ఛార్జిలతో వరుస సమావేశాలు.
• దేశవ్యాప్త ప్రచారానికి ప్రణాళిక.

ఢిల్లీ,మహా.: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా భారీ ప్రచార కార్యక్రమాలకు బీజేపీ సిద్ధమవుతోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో కొత్తగా నియమితులైన జాతీయ కార్యవర్గంతో సమావేశాలు నిర్వహిస్తున్న పార్టీ, రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ఇన్‌ఛార్జిలతోనూ చర్చలు జరుపుతోంది. మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా సాగించిన 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

మోదీ 2001లో గుజరాత్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ప్రారంభమైన ఆయన పాలనా ప్రస్థానం 2014లో ప్రధానమంత్రి పదవికి చేరింది. అప్పటి నుంచి వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోదీ నాయకత్వాన్ని పార్టీ తన ప్రధాన రాజకీయ బలంగా ప్రదర్శిస్తోంది. మౌలిక వసతులు, డిజిటల్‌ పాలన, సంక్షేమ పథకాలు, విదేశాంగ విధానం, రక్షణ, అంతరిక్షం, ఆర్థిక వ్యవస్థ వంటి రంగాల్లో కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రచారంలో ప్రధాన అంశాలుగా తీసుకురావాలని పార్టీ భావిస్తోంది.

ఇదే సమయంలో రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2029 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సంస్థాగత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపైనా బీజేపీ దృష్టి సారిస్తోంది. యువతతో అనుసంధానం, క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాల విస్తరణ, సామాజిక మాధ్యమాల ప్రచారం, బూత్‌ స్థాయి వ్యవస్థ బలోపేతం వంటి అంశాలు సమావేశాల్లో చర్చకు వస్తున్నాయి. ‘మోదీ@25’ను కేవలం వార్షికోత్సవ కార్యక్రమంగా కాకుండా దీర్ఘకాలిక రాజకీయ ప్రచారంగా మలచాలని పార్టీ యోచిస్తున్నట్లు సమాచారం. దేశంలోని ప్రతి రాష్ట్రంలో మోదీ పాలనపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి, కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఎలా చేరాయన్నదాన్ని వివరించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి.

Latest