• ‘సేవా సంకల్ప్ అభియాన్’ను ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలి: పొంగులేటి సుధాకర్‌రెడ్డి.
ఢిల్లీ, మహా.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరిపాలనా బాధ్యతలు చేపట్టి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘సేవా సంకల్ప్ అభియాన్’ను ప్రజాసేవ, సుపరిపాలన, అభివృద్ధి, అంత్యోదయ స్ఫూర్తిని ప్రతిబింబించే మహత్తర ప్రజా ఉద్యమంగా నిర్వహించనున్నట్లు తెలంగాణ మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ తమిళనాడు–కర్ణాటక జాతీయ సహ ఇన్‌చార్జి డా. పొంగులేటి సుధాకర్‌రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నాయకత్వంలో జరిగిన విస్తృత స్థాయి సంస్థాగత సంప్రదింపుల సమావేశంలో ఈ కార్యక్రమ కార్యాచరణపై చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధానమంత్రిగా దేశానికి నాయకత్వం వహిస్తున్న నేటి వరకు మోదీ రాజకీయ ప్రస్థానానికి సేవ, సుపరిపాలన, అభివృద్ధి, అంత్యోదయమే మూలస్తంభాలుగా నిలిచాయని సుధాకర్‌రెడ్డి అన్నారు. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు ఆయన ప్రయాణం కేవలం పదవుల ప్రస్థానం కాదని, లభించిన ప్రతి బాధ్యతను ప్రజాసేవకు సాధనంగా మార్చిన 25 ఏళ్ల తపస్సు అని పేర్కొన్నారు. సమాజంలోని చివరి వ్యక్తికీ అభివృద్ధి ఫలాలు అందాలన్న సంకల్పమే ఆయన పాలనా విధానానికి ఆత్మ అని వివరించారు.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు జరిగే అభియాన్‌లో యువత, మహిళలు, రైతులు, కార్మికులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, వృత్తి నిపుణులతో పాటు సమాజంలోని అన్ని వర్గాలను భాగస్వాములను చేయనున్నట్లు తెలిపారు. సేవా కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం, లబ్ధిదారులతో ప్రత్యక్ష సంప్రదింపులు, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించడంతో పాటు మోదీ నాయకత్వంలో దేశంలో చోటుచేసుకున్న మార్పులను ప్రజలకు వివరించనున్నట్లు చెప్పారు.
దేశ పరివర్తన కథను కొత్త తరానికి వాస్తవాలు, గణాంకాలు, లబ్ధిదారుల అనుభవాలు, ప్రజాసేవ ద్వారా తెలియజేయాల్సిన అవసరం ఉందని సుధాకర్‌రెడ్డి అన్నారు. పేదల జీవితాల్లో పాలన తీసుకొచ్చిన మార్పు, మౌలిక సదుపాయాల విస్తరణ, పేదరిక నిర్మూలన, ప్రపంచ వేదికపై భారత్ స్థానం బలోపేతం వంటి అంశాలను యువతకు వివరించాల్సి ఉందన్నారు. రాజకీయాలు అంటే కేవలం అధికారం కాదని, సేవ, బాధ్యత, దేశ నిర్మాణం అనే భావనను యువతలో బలపరిచే కార్యక్రమంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిలవాలని ఆకాంక్షించారు.
రాహుల్, ఖర్గేలకు ఘాటు కౌంటర్
కాంగ్రెస్ నాయకులు రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే రాజకీయ వైఖరిపై సుధాకర్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల అనుమానాలు, అపనమ్మకాలు పెంచేలా కాంగ్రెస్ నాయకత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయడమే బీజేపీ లక్ష్యమని, అభివృద్ధి, ఆకాంక్షలు, అవకాశాలపై తాము మాట్లాడుతుంటే కాంగ్రెస్ ఆరోపణలు, ప్రతికూలత, రాజకీయ అనుమానాల చుట్టూ తిరుగుతోందని విమర్శించారు.
ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ప్రతిపక్ష హక్కు మాత్రమే కాక ప్రజాస్వామ్యానికి అవసరమని, అయితే ప్రభుత్వంపై రాజకీయ వ్యతిరేకత దేశంపై నిరంతర నిరాశావాద ప్రచారంగా మారకూడదని అన్నారు. రాహుల్‌గాంధీకి మోదీని రాజకీయంగా వ్యతిరేకించే స్వేచ్ఛ ఉందని, కాంగ్రెస్‌కు బీజేపీని ప్రశ్నించే హక్కు ఉందని పేర్కొంటూనే, ప్రతి వ్యవస్థపైనా అనుమానాలు సృష్టించడం, అర్ధసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయదని వ్యాఖ్యానించారు.
అభివృద్ధిపై చర్చకు రావాలి
కాంగ్రెస్ నాయకత్వానికి సుధాకర్‌రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. మౌలిక సదుపాయాలు, ఆర్థిక సమ్మిళితం, పారిశుద్ధ్యం, గృహ నిర్మాణం, తాగునీరు, ఆరోగ్యం, డిజిటల్ విప్లవం, మహిళా సాధికారత, జాతీయ భద్రత, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలపై కాంగ్రెస్ తన రికార్డును, బీజేపీ తన రికార్డును ప్రజల ముందు ఉంచాలని సూచించారు. తుది తీర్పును ప్రజలకే వదిలేద్దామని అన్నారు.
ప్రతిపక్షం తన రాజకీయ శక్తిని ఒక వ్యక్తిని వ్యతిరేకించడానికే వినియోగిస్తుంటే, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన శక్తినంతా 140 కోట్ల మంది భారతీయుల సేవకు అంకితం చేస్తున్నారని సుధాకర్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రతికూల రాజకీయాలకు తమ సమాధానం సేవ అని, తప్పుడు ప్రచారానికి వాస్తవాలే సమాధానమని, విభజన రాజకీయాలకు ‘సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్’తో జవాబిస్తామని స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు జరిగే ‘సేవా సంకల్ప్ అభియాన్’లో బీజేపీ కార్యకర్తలతో పాటు ప్రజలు, ముఖ్యంగా యువత పెద్దఎత్తున భాగస్వాములు కావాలని సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘సేవ–సంకల్పం–ప్రజా భాగస్వామ్యం’ స్ఫూర్తితో ఈ నెల రోజుల కార్యక్రమాన్ని వికసిత్ భారత్ @2047 లక్ష్య సాధన దిశగా మహత్తర ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు.






