• సంక్షేమానికి, రాజకీయ ప్రలోభానికి మధ్య వ్యత్యాసమెక్కడ?
• కమిటీలతోనే కథ ముగుస్తుందా? చట్టాలకు పదును పెడతారా?
• ఆర్థిక క్రమశిక్షణకు, ప్రజాకర్షక పథకాలకు మధ్య నలుగుతున్న రాజ్యాంగ ప్రశ్నలు.
(గడల నరసింహారావు, సీనియర్ జర్నలిస్ట్)
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలు, నగదు బదిలీలు, వస్తువుల పంపిణీ వంటి పథకాలపై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న తీవ్రస్థాయి చర్చకు సుప్రీంకోర్టు జోక్యం కొత్త మలుపు తీసుకొచ్చింది. అయితే ఈ క్లిష్టమైన సమస్యకు నేరుగా పరిష్కారం చూపకుండా నిపుణుల కమిటీ ఏర్పాటు దిశగా అత్యున్నత న్యాయస్థానం మొగ్గుచూపడంపై అప్పట్లోనే న్యాయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కమిటీ ఏర్పాటు చేసి నివేదిక తీసుకోవడం ద్వారా సమస్య పరిష్కారం కాకుండా మరింత కాలం వాయిదా పడే ప్రమాదం ఉందనే ఆందోళనలు వినిపించాయి. ఇది చివరకు కమిటీల పేరుతో అసలు సమస్యను పాతిపెట్టినట్లే మారకూడదన్న విమర్శలూ లేకపోలేదు. 2022లో ప్రారంభమైన ఈ సుప్రీంకోర్టు విచారణ నేటికీ కొనసాగుతుండటం గమనార్హం. 2026లోనూ ఇదే అంశానికి సంబంధించిన కొత్త ప్రజాహిత వ్యాజ్యాలు ప్రధాన కేసుతో అనుసంధానమవుతున్నాయి. ఏప్రిల్ 20, 2026న దాఖలైన మరో వ్యాజ్యాన్ని కూడా 2022లో నమోదైన ప్రధాన కేసుతో కలపాలని సుప్రీంకోర్టు ఆదేశించడాన్ని బట్టి, ఎన్నికల సమయంలో ఇచ్చే ఉచిత హామీలపై సమగ్ర రాజ్యాంగపరమైన పరిష్కారం ఇంకా వెలువడలేదన్న విషయం స్పష్టమవుతోంది.
ఈ కమిటీ ప్రతిపాదన వెనుక ఉన్న నేపథ్యాన్ని పరిశీలిస్తే.. 2022 ఆగస్టు 3న అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం రాజకీయ పార్టీలు ప్రకటించే ఉచిత హామీలు దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావాన్ని సమగ్రంగా అంచనా వేయాల్సిన అవసరాన్ని గుర్తించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అధికార, ప్రతిపక్షాలు, ఆర్థిక సంఘం, రిజర్వు బ్యాంకు, నీతి ఆయోగ్ ప్రతినిధులతో ఒక నిపుణుల సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచనను ముందుకు తెచ్చింది. బీజేపీ నేత, న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం ద్వారా తెరపైకి వచ్చిన ఈ వ్యవహారంలో.. ఎన్నికల ముందు ఓటర్లను ఆకర్షించేందుకు రాష్ట్రాల ఆర్థిక సామర్థ్యానికి మించిన హామీలు ఇవ్వడం వల్ల ఖజానాపై పడుతున్న భారాన్ని పిటిషనర్ ప్రధానంగా ప్రస్తావించారు. ప్రజా రుణభారం, ఆర్థిక స్థిరత్వం, ఎన్నికల్లో సమాన అవకాశాలు వంటి కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
అయితే ఇక్కడే న్యాయపరమైన చిక్కుముడులు ఎదురవుతున్నాయి. ఒక కమిటీ సిఫారసు చేసినంత మాత్రాన దానికి చట్టబద్ధత ఎలా వస్తుందన్న సీనియర్ న్యాయవాది రాజీవ్ ధవన్ లేవనెత్తిన ప్రశ్నలు అత్యంత కీలకంగా మారాయి. చట్టపరమైన బలం లేకుండా రాజకీయ పార్టీ ప్రకటించిన హామీకి ఆ పార్టీని లేదా నాయకుడిని ఎలా బాధ్యుడిని చేస్తారు? పార్టీని రద్దు చేయగలరా లేదా అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించగలరా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే సైతం ఇదే కోణంలో స్పందిస్తూ.. కమిటీ నివేదిక సిఫారసులపై న్యాయస్థానం చర్య తీసుకోవాలనుకుంటేనే అసలు రాజ్యాంగ, న్యాయపరమైన ప్రశ్నలు ముందుకు వస్తాయని కుండబద్దలు కొట్టారు. మరోవైపు ఈ వ్యవహారంలో ఎన్నికల సంఘానికీ స్పష్టమైన పరిమితులు ఉన్నాయి. ఉచిత హామీలు, వాటి అమలు అనేది రాజకీయ విధాన నిర్ణయానికి సంబంధించిన విషయమని, వాటి ఆర్థిక సాధ్యాసాధ్యాలను ఓటర్లే పరిశీలించుకోవాల్సి ఉంటుందని ఈసీ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. ఒక పథకానికి ఎంత ఖర్చు చేయాలి, ఉచిత హామీలకు ఆర్థిక పరిమితి ఎంత ఉండాలి అన్నది నిర్ణయించే చట్టబద్ధమైన అధికారం తమకు లేదని తేల్చిచెప్పింది. ఈ ఏడాది జనవరిలో కేరళ హైకోర్టు ముందుకు వచ్చిన ఒక కేసులోనూ ఎన్నికల ప్రణాళికల్లో సంక్షేమ హామీలను పూర్తిగా నిషేధించడం సాధ్యం కాదన్న భావన వ్యక్తమైంది.
అసలు సమస్య అంతా అన్ని ఉచిత పథకాలనూ ఒకే గాటన కట్టలేకపోవడమే. పేదలకు ఆహారం, విద్య, వైద్యం, గృహం, సామాజిక భద్రత కల్పించడం సంక్షేమ రాజ్య కనీస బాధ్యత. వాటిని సైతం ఉచితాలుగా పేర్కొని ఎన్నికల ప్రలోభాలతో సమానంగా చూడటం ఎంతవరకు సమంజసం అన్న బలమైన వాదన వినిపిస్తోంది. ఎన్నికలకు ముందు ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ఇచ్చే ప్రత్యక్ష నగదు, ఉచిత వస్తువుల పంపిణీకి.. ప్రాథమిక అవసరాలను తీర్చే సంక్షేమ కార్యక్రమాలకు మధ్య స్పష్టమైన విభజన రేఖ అవసరమని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 2013 నాటి ఎస్. సుబ్రమణ్యం బాలాజీ కేసు నుంచి నేటి వరకు ఎన్నికల హామీలకు అవసరమైన ఆర్థిక వనరుల మార్గాన్ని వెల్లడించాలన్న సూత్రం వినిపిస్తున్నా, ఆచరణలో ఉచితాలకు స్పష్టమైన ఆర్థిక పరిమితిని నిర్ణయించే వ్యవస్థేదీ ఏర్పాటు కాలేదు. సంక్షేమ పథకాలన్నింటినీ ఉచితాల పేరుతో విమర్శించడం సరికాదని, అదే సమయంలో ఎన్నికల్లో ధన ప్రభావాన్ని అరికట్టే దిశగా పారదర్శకత కూడా అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్లిష్టమైన సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉందన్నది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సూచించినట్లు ఇది కేవలం ఎన్నికల సంఘం పరిధిలోని అంశం కాదు.. పార్లమెంటు సమగ్రంగా చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన విధానపరమైన అంశం. ఉచిత హామీలను నియంత్రించాలంటే కఠినమైన చట్టపరమైన వ్యవస్థ అవసరం. ఆ చట్టాన్ని రూపొందించాల్సింది పార్లమెంటే అయినప్పటికీ.. రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులే పార్లమెంటులో చట్టాలను రూపొందిస్తారు కాబట్టి, తాము ఇచ్చే హామీలపై వారే కఠిన పరిమితులు విధించుకుంటారా అన్నది అతిపెద్ద సందేహం. రాజకీయ పార్టీలను రద్దు చేయడం వంటి తీవ్ర నిర్ణయాల విషయంలో సుప్రీంకోర్టుకూ రాజ్యాంగపరమైన పరిమితులు ఉన్నాయి.
ఓటరుకు ఎన్నికల సమయంలో ఉచితంగా అందించే వస్తువు లేదా నగదు విలువ ఎంత అన్నదానికంటే, దాని కోసం ప్రభుత్వ ఖజానా భవిష్యత్‌లో ఎంత భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నదే అసలు ప్రశ్న. ఒకవైపు ప్రజా సంక్షేమాన్ని నిర్ధారించడం ప్రభుత్వ బాధ్యత కాగా, మరోవైపు గెలుపే లక్ష్యంగా రాష్ట్ర ఆర్థిక సామర్థ్యాన్ని మించి హామీలు గుప్పిస్తే భవిష్యత్ తరాలపై మోయలేని అప్పుల భారం పడుతుంది. ఈ రెండు అంశాల మధ్య సమతుల్యత సాధించడమే ప్రస్తుత వ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాలు. హద్దు దాటితే ఎవరు అడ్డుకోవాలి? అమలు బాధ్యత ఎవరిది? అన్న ప్రశ్నలకు స్పష్టమైన చట్టపరమైన సమాధానాలు దొరకనంత వరకు ఉచిత హామీల వివాదానికి తెరపడే అవకాశం లేదు. సంక్షేమ హక్కులను కాపాడుతూనే ఎన్నికల ప్రలోభ రాజకీయాలకు ఎలా కళ్లెం వేయాలి? ఆర్థిక క్రమశిక్షణను ఎలా నిర్ధారించాలి? అన్న ప్రశ్నలకు న్యాయస్థానంతో పాటు పార్లమెంటు, ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీలు, ఓటర్లు సమిష్టిగా సమాధానం వెతకాల్సి ఉంది. భారత ప్రజాస్వామ్య భవిష్యత్తును ప్రభావితం చేయగల ఈ అత్యంత కీలకమైన అంశంలో ఆ ‘తుది గీత’ ఎక్కడ గీయబడుతుందన్నదే ఇప్పుడు యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అంశం.





