- ఎస్ఐఆర్ పూర్తయితే కొత్త ఓటర్ల జాబితా..
- లేకుంటే పాత జాబితాతోనే ఎన్నికలు
అమరావతి, మహా : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు మార్గం సుగమం చేసింది. ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. ఏపీ హైకోర్టు నిర్దేశించిన గడువులోపు నోటిఫికేషన్ జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఎస్ఈసీ తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోపు ప్రారంభించాలని ఏపీ హైకోర్టు గతంలో ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస్ఈసీ కూడా ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షలు నిర్వహిస్తోంది.
ఎస్ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ) ప్రక్రియ స్థానిక సంస్థల ఎన్నికలకు అడ్డంకి కాదని ఏపీ హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. 2026 జనవరి 1 నాటికి అందుబాటులో ఉన్న ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని ఎన్నికలు నిర్వహించే విషయంలో ఎస్ఈసీ నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. అయితే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందే ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయి, తుది ఓటర్ల జాబితా అందుబాటులోకి వస్తే దానిని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఒకవేళ ఆ ప్రక్రియ పూర్తికాకపోతే ప్రస్తుతం అందుబాటులో ఉన్న పాత జాబితాతోనే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, ఎన్నికల సామగ్రి, భద్రత తదితర అంశాలపై అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందన్న దానిపై అధికారిక ప్రకటన కోసం రాజకీయ వర్గాలు, ఆశావహులు ఎదురు చూస్తున్నారు.








