Mahaa Daily Exclusive

  ఎస్ఐఆర్ లో 95 లక్షల ఓట్లు తొలగించలేదు తెలంగాణ సీఈవో సుదర్శన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు తప్పుడు ప్రచారం సరైంది కాదని వెల్లడి

Share

హైదరాబాద్, మహా : తెలంగాణలో 95 లక్షల ఓట్లు తొలగించారంటూ జరుగుతున్న ప్రచారంపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) సి. సుదర్శన్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈ వార్తలో వాస్తవం లేదని.. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. ఓటర్ల వివరాల పరిశీలన, నోటీసుల జారీ, విచారణల అనంతరం అర్హత నిర్ధారణ వంటి దశలు పూర్తయిన తర్వాతే తుది జాబితాపై స్పష్టత వస్తుందని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న గణాంకాలను ఆధారంగా చేసుకుని 95 లక్షల ఓట్లు తొలగించినట్లు చెప్పడం సరైంది కాదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల జాబితా సవరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 73,39,235 మంది ఓటర్లను ఏఎస్‌డీడీ కేటగిరీలో గుర్తించినట్లు సీఈవో వివరించారు.

ఈ ఏఎస్‌డీడీ విభాగంలో గైర్హాజరైనవారు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లినవారు, మరణించినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల పేర్లు నమోదైనవారు ఉంటారని పేర్కొన్నారు. అయితే ఈ కేటగిరీలో చేర్చిన సంఖ్యనే తుది జాబితా నుంచి శాశ్వతంగా తొలగించిన ఓట్ల సంఖ్యగా పరిగణించకూడదని ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు. సంబంధిత ఓటర్ల వివరాలను పరిశీలించి, నోటీసుల ప్రక్రియను పూర్తి చేసి, అర్హతపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ముసాయిదా జాబితాలో జరిగిన మార్పులను తుది తొలగింపులుగా భావించడం సరికాదు. ఓటర్ల వివరాల్లో ఉన్న వ్యత్యాసాలు, పాత రికార్డులతో వివరాలను అనుసంధానించలేకపోవడం వంటి కారణాలతో మొత్తం 92,88,187 నోటీసులు జారీ చేసినట్లు సీఈఓ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. వీటిలో 92,23,486 నోటీసులు సంబంధిత ఓటర్లకు అందజేశారు. మరో 64,701 నోటీసుల పంపిణీ ఇంకా పూర్తి కావాల్సి ఉందని వెల్లడించారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వివరాలను సమర్పించి, అవసరమైన పత్రాలతో విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఈ ప్రక్రియ ద్వారా ఓటర్ల అర్హతను నిర్ధారించి, తుది జాబితాలో పేర్లను చేర్చాలా లేదా అనే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.

సీఈవో వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 82,11,205 మంది ఓటర్లకు సంబంధించిన విచారణలు పూర్తి అయ్యాయి. తుది ఓటర్ల జాబితాలో చోటు కల్పించేందుకు 74,62,851 మందిని అర్హులుగా గుర్తించారు. మరో 12,969 మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. ఇంకా 18,12,367 మంది ఓటర్లకు సంబంధించిన కేసులపై నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ గణాంకాలు చూపిస్తున్నట్లుగా.. ఓటర్ల అర్హత నిర్ధారణ ప్రక్రియలో ఇంకా కొన్ని దశలు మిగిలి ఉన్నాయి. అందువల్ల తుది జాబితా ప్రచురణకు ముందే భారీ సంఖ్యలో ఓట్లు తొలగిపోయాయని నిర్ధారించడం సరికాదని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. పెండింగ్‌లో ఉన్న నోటీసులు, క్లెయిమ్‌లు, అభ్యంతరాలపై నవంబర్ 5వ తేదీలోగా నిర్ణయాలు తీసుకోవాలని ఎన్నికల యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తర్వాత తుది ఓటర్ల జాబితాను నవంబర్ 9వ తేదీన ప్రచురించేందుకు షెడ్యూల్ ఉంది. మిగిలిన కేసులను గడువులోగా పరిష్కరించి.. అర్హులైన ఓటర్ల పేర్లను తుది జాబితాలో చేర్చే ప్రక్రియ కొనసాగుతుందని సీఈవో తెలిపారు. ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవడం ముఖ్యమని ఎన్నికల అధికారులు పేర్కొంటున్నారు. నోటీసు అందినవారు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. అధికారులు సూచించిన విధంగా స్పందించి అవసరమైన ఆధారాలను సమర్పించాలని చెబుతున్నారు. పేర్లు, అడ్రస్‌లు, ఇతర వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేసుకునేందుకు ఎన్నికల అధికారులను సంప్రదించాల్సి ఉంటుందని వివరించారు.