Mahaa Daily Exclusive

  భారత సంతతి మహిళకు నోబెల్ శాంతి బహుమతి

Share

  • నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం
  • న్యాయ రంగంలో మానవ హక్కులు, మహిళా హక్కుల రక్షణకు చేసిన సేవలకు పురస్కారం

మహా : భారత సంతతికి చెందిన నవనీతం నవి పిళ్లైని నోబెల్ శాంతి పురస్కారం వరించింది. ఆమె అంతర్జాతీయ న్యాయ రంగం, మానవ హక్కుల పరిరక్షణలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన దక్షిణాఫ్రికాకు చెందిన న్యాయమూర్తి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్‌గా, అంతర్జాతీయ నేర న్యాయస్థానాలకు సైతం న్యాయమూర్తిగా సేవలందించారు. ప్రపంచ వ్యాప్తంగా మానవ హక్కుల పురోగతికి, మహిళా హక్కుల రక్షణకు చేసిన కృషిని గుర్తించి 2026 ఏడాదికిగానూ నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించారు.

నవనీతం నవి పిళ్లై 1941 సెప్టెంబర్ 23న దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో ఒక తమిళనాడుకు చెందిన భారత సంతతి కుటుంబంలో జన్మించారు. నాటల్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బి పట్టాలు పొందారు. ఆ తువాత అమెరికాలోని హార్వర్డ్ లా స్కూల్ నుంచి ఎల్‌ఎల్‌ఎమ్, డాక్టర్ ఆఫ్ జ్యూరిడికల్ సైన్స్ డిగ్రీలు పూర్తి చేశారు. హార్వర్డ్ లా స్కూల్ నుంచి డాక్టోరేట్ పొందిన తొలి దక్షిణాఫ్రికా మహిళగా నవి పిళ్లై రికార్డు సృష్టించారు.

జాతి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం

1967లో నాటల్ ప్రావిన్స్‌లో సొంతంగా లా ఫార్మ్ ప్రారంభించిన మొదటి శ్వేతజాతీయేతర మహిళగా నిలిచారు. దక్షిణాఫ్రికాలోని జాతి వివక్ష పాలన కాలంలో ఆమె వర్ణవివక్షకు వ్యతిరేకంగా పోరాడిన నేతలకు, హక్కుల కార్యకర్తలకు లాయర్‌గా ఉచితంగా సేవలందించారు. రాబెన్ ఐలాండ్‌లో జైలు శిక్ష అనుభవిస్తున్న నెల్సన్ మండేలా వంటి ప్రముఖ నేతల ప్రాథమిక హక్కుల కోసం, జైలులో వారి పరిస్థితి మెరుగ్గా ఉండాలంటూ పోరాడారు.

రువాండా అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ సేవలు

1995లో దక్షిణాఫ్రికా అధ్యక్షుడిగా నెల్సన్ మండేలా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, నవీ పిళ్లైని దక్షిణాఫ్రికా హైకోర్టు మొదటి నల్లజాతీయ మహిళా న్యాయమూర్తిగా నియమించారు. అదే ఏడాది ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఆమెను రువాండా అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ న్యాయమూర్తిగా నియమించి గౌరవించింది. ఆమె నాలుగేళ్ల పాటు అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలో జాన్ పాల్ అకయేసు కేసులో మానభంగాన్ని కేవలం వ్యక్తిగత నేరంగా కాకుండా, “జెనోసైడ్”, యుద్ధ నేరంగా గుర్తించే తీర్పును వెలువరించడంలో కీలక పాత్ర పోషించారు.

అంతర్జాతీయ నేర న్యాయస్థానం, యుఎన్ హైకమిషనర్

2003లో ది హేగ్‌లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఏర్పాటు కాగా, తొలి ఆరుగురు న్యాయమూర్తుల బృందంలో నవి పిళ్లై ఒకరు కావడం విశేషం. 2008 నుండి 2014 వరకు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె ప్రపంచవ్యాప్తంగా జరిగే యుద్ధ నేరాలు, జాతి నిర్మూలన, భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ల్ జి బిటిక్యూ ప్లస్ హక్కులు, మహిళా సాధికారతపై తన గళాన్ని వినిపించడంలో సక్సెస్ అయ్యారు. మయన్మార్ రోహింగ్యా సంక్షోభం, ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాలలో మానవ హక్కుల ఉల్లంఘనలపై ఏర్పాటు చేసిన యూఎన్ స్వతంత్ర కమిషన్‌కు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. న్యాయ రంగంలో, మానవ హక్కుల కోసం చేసిన సేవలకుగానూ ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ గౌరవ పురస్కారాలు, యూనివర్సిటీల నుంచి గౌరవ డాక్టోరేట్లను అందుకున్నారు.