ఆరోపణలు కాదు.. ఆధారాలుంటే కోర్టుకు వెళ్లండి.
• ఓట్ల చోరీ ప్రచారంపై 42 మంది మాజీ న్యాయమూర్తుల తీవ్ర ఆందోళన.
*’రాజకీయ పార్టీలు, మీడియాకు బహిరంగ లేఖ ద్వారా హితవు.
న్యూఢిల్లీ, మహా:
ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ తదితర రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసేలా జరుగుతున్న ప్రచారంపై 42 మంది మాజీ న్యాయమూర్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల చోరీ జరుగుతోందంటూ ఆధారాల్లేకుండా ప్రజా వేదికలపై పదేపదే ఆరోపణలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని సన్నగిల్లజేస్తుందని వారు హెచ్చరించారు. ఈ మేరకు అక్టోబర్ 7న ఒక బహిరంగ లేఖను విడుదల చేశారు. రాజకీయ పార్టీలు తమ వద్ద ఉన్న అభ్యంతరాలను, ఆధారాలను ఎన్నికల సంఘం లేదా న్యాయస్థానాల ముందు ఉంచాలని అందులో స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌తో పాటు పలు హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తులు బీసీ పటేల్, సుభ్రో కమల్ ముఖర్జీ, పర్మోద్ కోహ్లీ తదితరులు ఈ లేఖపై సంతకాలు చేసిన వారిలో ఉన్నారు.
* విమర్శించే హక్కుంది.. కించపరిచేలా కాదు.
రాజ్యాంగ సంస్థలను విమర్శించడం ప్రజాస్వామ్య హక్కు అని, అయితే వాటిని కించపరచడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మాజీ న్యాయమూర్తులు తమ లేఖలో స్పష్టం చేశారు. ఇటీవల ఎన్నికల సంఘం, ఉన్నత న్యాయవ్యవస్థను లక్ష్యంగా చేసుకుని నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు పెరిగిపోవడం పట్ల వారు విచారం వ్యక్తం చేశారు. ప్రజా వేదికలపై అధికారులను అవమానకరమైన పదజాలంతో సంబోధించడం, భవిష్యత్తులో ప్రతీకార చర్యలు తప్పవని బెదిరించడం వంటి పరిణామాలు మంచివి కావన్నారు. ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ రాజకీయ వేదికలు, విలేకరుల సమావేశాల్లో ఆరోపిస్తున్న నేతలు.. అదే అంశాన్ని ఆధారాలతో సహా కోర్టుల ముందు ఎందుకు ఉంచడం లేదని వారు సూటిగా ప్రశ్నించారు. ఈసీ ప్రమాణపూర్వక ప్రకటన కోరిన సందర్భాల్లోనూ అవసరమైన ఆధారాలు సమర్పించలేకపోయారని గుర్తుచేశారు.
* ఓటమి తర్వాతే ఈవీఎంలపై అనుమానాలా?.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై రాజకీయ పార్టీల ద్వంద్వ వైఖరిని మాజీ న్యాయమూర్తులు తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంల ఫలితాలను అంగీకరించి, ఓడినప్పుడు మాత్రం వాటి విశ్వసనీయతను ప్రశ్నించడం సరికాదన్నారు. ఒకే ఎన్నికల వ్యవస్థ ద్వారా వచ్చిన ఫలితాల్లో తమకు అనుకూలమైన వాటిని అంగీకరించి, ప్రతికూలమైన వాటిని మాత్రమే అనుమానించడం వల్ల ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో నమ్మకం బలహీనపడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు పూర్తి చట్టబద్ధత ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 324వ అధికరణ, 1950 ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 21(3) సెక్షన్ కింద ప్రత్యేక సవరణ చేపట్టే అధికారం ఈసీకి ఉందని తెలిపారు. ఈ ప్రక్రియను మే 27, 2026న సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తుచేశారు. మరణించిన వారి పేర్లు, ఒకే వ్యక్తి బహుళ నమోదులు, శాశ్వతంగా నివాసం మార్చుకున్న వారి పేర్లను తొలగించి జాబితాను నిరంతరం శుద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
* ప్రజల నమ్మకమే ప్రజాస్వామ్యానికి మూలధనం.
ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రజల విశ్వాసమే ప్రధాన బలమని, పదేపదే వారి ఓటుకు విలువ లేదని ప్రచారం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని మాజీ న్యాయమూర్తులు హెచ్చరించారు. బ్యాలెట్‌పై నమ్మకం దెబ్బతింటే సామాజిక ఉద్రిక్తతలు తలెత్తి, అరాచక శక్తులు ఆ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉందన్నారు. రాజకీయ పోరాటం ఎంత తీవ్రంగా ఉన్నా, రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీయొద్దని పార్టీలకు హితవు పలికారు. ఎన్నికలను బహిష్కరించడం లేదా అనుమానాలు సృష్టించడం కంటే న్యాయపరమైన మార్గాలను ఎంచుకోవడమే సరైన పద్ధతి అని సూచించారు.
* వాస్తవాలను పరిశీలించాకే ప్రచురించాలి.
ఎన్నికల వివాదాల్లో మీడియా పాత్ర అత్యంత కీలకమని లేఖలో పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలను, ఊహాగానాలను గుడ్డిగా ప్రచారం చేయవద్దని, వాస్తవాలను పరిశీలించాకే ప్రజల ముందుకు తీసుకురావాలని పత్రికలు, ఛానళ్లకు సూచించారు. ఒక వార్త శీర్షికే ఆరోపణకు ఆధారం కాదని, అసత్యాలను పదేపదే ప్రచారం చేసినంత మాత్రాన అవి నిజాలు కావని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి అంశాన్ని ప్రజలు కూడా వెంటనే నమ్మకుండా వాస్తవాలను బేరీజు వేసుకోవాలని వారు ఆకాంక్షించారు. రాజ్యాంగ సంస్థలు ఏ ఒక్క ప్రభుత్వానికో, పార్టీకో చెందినవి కావని.. అవి భారతదేశ ప్రజలందరివని మాజీ న్యాయమూర్తులు తమ లేఖలో ఉద్ఘాటించారు.







