Mahaa Daily Exclusive

  మద్యం వినియోగంలో తెలంగాణ టాప్…

Share

  • మద్యం వినియోగంలో తెలంగాణ టాప్
  • గ్రామాల్లోనే విక్రయం అధికం
  • మద్యం వినియోగంలో ప్రథమ స్థానంలో నిలిచిన జనగామా
  • చివరి స్థానంలో నిలిచిన ఆదిలాబాద్
  • 31 స్థానంలో నిలిచిన హైదరాబాద్,
  • హైదరాబాద్‌లో కేవలం 30.4 శాతమే

హైదరాబాద్, మహా : తెలంగాణలో మద్యం వినియోగంపై నేషనల్ ఫ్యామిలీ హెల్త్ (ఎన్ఎఫ్ హెచ్ఎస్ – 6 ) సర్వే ఆరు కీలక విషయాలను వెల్లడించింది. రాష్ట్రంలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పురుషుల్లో 43.9 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు సర్వే తెలిపింది. అయితే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ 33 జిల్లాల్లో 31వ స్థానంలో నిలిచింది. ఇక్కడ పురుషుల మద్యం వినియోగం 30.4 శాతంగా నమోదైంది. జనగాంలో అత్యధికంగా 61.6 శాతం ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో వినియోగం పట్టణాల కంటే ఎక్కువగా ఉంది. మద్యం వినియోగాన్ని శాతం ఆధారంగా మాత్రమే ఎన్ఎఫ్ హెచ్ ఎస్ -6 లెక్కించింది. తెలంగాణలో మద్యం వినియోగం అధికంగా ఉన్నప్పటికీ రాజధాని హైదరాబాద్ మాత్రం రాష్ట్రంలోని జిల్లాలతో పోలిస్తే దిగువ స్థానంలో నిలిచింది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-6 ప్రకారం 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పురుషుల్లో మద్యం సేవించే వారి శాతం హైదరాబాద్‌లో 30.4గా నమోదైంది. దీంతో 33 జిల్లాల జాబితాలో హైదరాబాద్ 31వ స్థానంలో ఉంది. హైదరాబాద్ కంటే దిగువన ఆదిలాబాద్ 27.4 శాతం, కుమురం భీమ్ ఆసిఫాబాద్ 30.1 శాతంతో ఉన్నాయి. ఈ వివరాలు ఎన్ఎఫ్ హెచ్ఎస్ -6 జిల్లా ఫ్యాక్ట్‌షీట్ లలో నమోదైన గణాంకాల ఆధారంగా ఉన్నాయి.

రాష్ట్రంలో మద్యం దుకాణాలు, బార్లు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ హైదరాబాద్‌లో నమోదైన వినియోగ శాతం రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉండటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న పురుషుల్లో మద్యం వినియోగం 43.9 శాతంగా ఉంది. అంటే హైదరాబాద్ కంటే రాష్ట్ర సగటు 13.5 శాతం పాయింట్లు ఎక్కువ. మరోవైపు దేశవ్యాప్తంగా ఇదే వయసు పురుషుల్లో మద్యం వినియోగం 18.9 శాతంగా నమోదైంది. ఈ లెక్కన హైదరాబాద్ గణాంకం జాతీయ సగటు కంటే 11.5 శాతం పాయింట్లు ఎక్కువగా ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం దిగువ స్థాయిలో ఉంది.

జిల్లాల వారీగా చూస్తే జనగాంలో పురుషుల మద్యం వినియోగం అత్యధికంగా 61.6 శాతంగా నమోదైంది. ఆ తర్వాత జయశంకర్ భూపాలపల్లి 56.6 శాతం, వరంగల్ రూరల్ 56.5 శాతంతో ఉన్నాయి. యాదాద్రి భువనగిరి 54.1 శాతం, సిద్దిపేట 52.5 శాతంతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. దీనికి విరుద్ధంగా హైదరాబాద్, మెద్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి వంటి పట్టణ ప్రాంతాలు తక్కువ శాతాన్ని నమోదు చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ-పట్టణ వ్యత్యాసం కూడా స్పష్టంగా కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో 46.6 శాతం మంది పురుషులు మద్యం సేవిస్తున్నట్లు వెల్లడించగా, పట్టణ ప్రాంతాల్లో ఈ శాతం 36.3గా ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో పట్టణాలతో పోలిస్తే 10.3 శాతం పాయింట్ల అధిక వినియోగం నమోదైంది. ఈ వ్యత్యాసం తెలంగాణ మొత్తం గణాంకాలపై ప్రభావం చూపుతున్నట్లు సర్వే వివరాలు సూచిస్తున్నాయి.

మహిళల్లోనూ తెలంగాణ గణాంకాలు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్రంలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న మహిళల్లో 7.1 శాతం మంది మద్యం సేవిస్తున్నట్లు సర్వే తెలిపింది. గ్రామీణ మహిళల్లో ఈ శాతం 8.6గా ఉండగా పట్టణ మహిళల్లో 2.8 శాతంగా నమోదైంది. హైదరాబాద్‌లో మహిళల మద్యం వినియోగం 1.1 శాతంగా ఉంది. మొత్తంగా చూస్తే తెలంగాణలో మద్యం వినియోగం రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా లేదని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్‌లో భారీ సంఖ్యలో మద్యం విక్రయ కేంద్రాలు ఉన్నప్పటికీ వినియోగ శాతం జిల్లాల జాబితాలో దిగువన ఉండగా.. జనగాం సహా పలు జిల్లాల్లో నమోదైన శాతం 50 దాటింది. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య కనిపిస్తున్న వ్యత్యాసం మద్యం వినియోగంపై ప్రాంతాల వారీగా భిన్నమైన పరిస్థితులు ఉన్నట్లు సూచిస్తోంది.