- ఆర్మీ ఆయుధాల చోరీ కేసు
- వెలుగులోకి మరిన్ని సంచలన విషయాలు
- మరో ఏడుగురి అరెస్ట్ చేసిన పోలీసులు
- ఉగ్రకోణం ఏమీ లేదన్న మల్కాజిగిరి సీపీ సుమతి
హైదరాబాద్, మహా : నగరంలోని బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసు విచారణలో మల్కాజిగిరి పోలీసులు కీలకమైన పురోగతిని సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మల్లేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారించిన సందర్భంగా రాబట్టిన సమాచారం ఆధారంగా మరో ఏడుగురిని అరెస్టు చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వారిలో శేషు, వినోద్, నిరంజన్, ప్రవీణ్, మల్లికార్జున్‌లతో పాటు ఆయుధాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీర్బల్ షా, అవి దెయ్ ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మల్కాజిగిరి సీపీ సుమతి శనివారం మీడియాకు వెల్లడించారు. ఏ1 మల్లేష్ కాగా, నిందితుల్లో శేషు (ఏ2), వినోద్ (ఏ3), ప్రవీణ్ (ఏ4)లు ప్రస్తుతం ఆర్మీలోనే విధుల్లో కొనసాగుతున్నట్లు విచారణలో గుర్తించారు. అయితే, ఈ ఆయుధాల చోరీ వెనుక ఎలాంటి ఉగ్రవాద కోణం గానీ, ఉగ్రవాద సంస్థలతో లింకులు గానీ కనిపించలేదని సీపీ సుమతి స్పష్టం చేశారు. కేవలం భయాందోళనలు సృష్టించి, ఆయుధాలతో బెదిరించి భారీ చోరీలు చేయాలనే దురుద్దేశంతోనే నిందితులు ఈ కుట్రకు తెరలేపారని దర్యాప్తులో కీలక విషయాలు వెల్లడయ్యాయి.
ఆయుధాలతో బెదిరించి దోపిడీలకు ప్లాన్, విక్రయానికి సైతం..
ఆర్మీ బేస్ నుంచి చోరీ చేసిన ఆయుధాలను ఉపయోగించి ప్రధానంగా బ్యాంకులు, నగల దుకాణాల్లో దోపిడీలు చేయాలని నిందితులు ప్లాన్ చేశారు. అలాగే ధనవంతులైన వ్యక్తులను సైతం వీటితో బెదిరించి వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేయాలని నిందితులు కుట్ర చేసినట్లు తేల్చారు. ఈ దొంగిలించిన ఆయుధాలను విక్రయించడానికి పశ్చిమ బెంగాల్ చెందిన బీర్బల్ షా, అవి దెయ్‌లతో డీల్ సైతం కుదుర్చుకున్నారని బయటపడింది. ఒప్పందం ప్రకారం చోరీ చేసిన వాటిలో ఒక్కో పిస్టల్‌కు రూ. 3 లక్షలు, లాంగ్ వెపన్‌కు రూ. 5 లక్షల చొప్పున అమ్మాలని నిందితులు ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ వేగవంతం చేసినట్లు మల్కాజిగిరి సీపీ సుమతి మీడియాకు వివరించారు.








