Mahaa Daily Exclusive

  మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర విషాధం…

Share

  • మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర విషాధం
  • భూ సమస్య పరిష్కారం కాలేదని
  • ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో ఉరేసుకుని రైతు ఆత్మహత్య

మహబూబ్ నగర్, మహా : భూ సమస్య పరిష్కారం కోసం అధికారుల చుట్టూ తిరిగిన ఓ రైతు చివరకు తహసీల్దార్ కార్యాలయం ఆవరణలోనే ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. కోయిల్‌కొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. పారుపల్లి గ్రామానికి చెందిన రైతు లవప్ప (53) ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలోని చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారం ప్రకారం లవప్ప కుటుంబానికి వంశపారంపర్యంగా 19 ఎకరాల భూమి ఉండాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తన ఆధీనంలో 18 ఎకరాల భూమి మాత్రమే ఉందని.. మరో ఎకరం పొరుగు రైతుల భూమిలో ఉందని ఆయన అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

తన భూమికి సంబంధించిన సమస్యను పరిష్కరించాలని కొంతకాలంగా లవప్ప.. తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. భూమికి సంబంధించిన సమస్య పరిష్కారం కాకపోవడంతో లవప్ప తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. రైతు ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. లవప్ప ఆత్మహత్యకు భూ సమస్యే ప్రధాన కారణమా.. లేక ఇతర వ్యక్తిగత, ఆర్థిక కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్థానికులు, అధికారుల నుంచి.. పోలీసులు వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. తన సమస్యను పరిష్కరించడం కోసం రైతు ప్రభుత్వ కార్యాలయానికి వచ్చిన సమయంలోనే ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. భూ సమస్యల పరిష్కారంలో జాప్యం రైతు కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిందన్న ఆవేదన స్థానికుల్లో వ్యక్తమవుతోంది.