- అనంతగిరి ఘాట్ రోడ్డులో ట్రావెల్స్ బస్సు బోల్తా
- నలుగురు మహిళలు మృతి, పలువురికి గాయాలు
- సీఎం దిగ్భ్రాంతి
వికారాబాద్, మహా వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. అనంతగిరి ఘాట్ రోడ్డులో శనివారం ఉదయం ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు మృతి చెందగా.. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. బస్సులో సుమారు 50 నుంచి 54 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు, స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రమాదానికి గురైన బస్సు సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు సమీపంలోని కేసారం గ్రామం నుంచి వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం చింతకుంటకు వెళ్తోంది. ఓ బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు బస్సులో బయలుదేరారు. ఈ క్రమంలో అనంతగిరి కొండపై నుంచి కిందికి దిగుతున్న సమయంలో ఘాట్ రోడ్డులో బస్సు అదుపు తప్పింది.
డ్రైవర్ కంట్రోల్ తప్పడంతో బస్సు రహదారి పక్కకు దూసుకెళ్లి బోల్తా పడినట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదానికి అసలు కారణం ఏంటి అనేది ఇంకా అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది. రోడ్డు పరిస్థితి, డ్రైవర్ కంట్రోల్ తప్పడానికి దారితీసిన పరిస్థితులు వంటి అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. బస్సు బోల్తా పడటంతో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది కూడా ఘటనాస్థలానికి చేరుకుని బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చారు.
తొలుత ముగ్గురు మహిళలు ప్రమాదంలోనే మృతి చెందారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించగా మరో మహిళ మృతి చెందడంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా ప్రమాద స్థలాన్ని పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రమాదంతో అనంతగిరి ఘాట్ రోడ్డులో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. క్రేన్ సహాయంతో బస్సును పక్కకు తరలించి ట్రాఫిక్ ను పునరుద్దరించారు.
సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
అనంతగిరి ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి అవసరమైన మెరుగైన వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.
విచారం వ్యక్తం చేసిన కేటీఆర్
బస్సు ప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితులకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. అనంతగిరి ఘాట్ రోడ్డులో ప్రమాదానికి డ్రైవర్ నియంత్రణ కోల్పోవడం ప్రాథమిక కారణంగా అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే ప్రమాదానికి కచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కాలేదు.








