Mahaa Daily Exclusive

  మహిళా సాధికారతతోనే ‘వికసిత్ భారత్’ సాధ్యం..

Share

  • మహిళా సాధికారతతోనే ‘వికసిత్ భారత్’ సాధ్యం
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు
  • మహిళల సంక్షేమం, ఆరోగ్యానికి ప్రధాని మోదీ అత్యున్నత ప్రాధాన్యం
  • మల్లాపూర్‌లో ఘనంగా ‘సేవా సంకల్ప్ అభియాన్ – అంగన్ మిలాన్’ కార్యక్రమం

హైదరాబాద్, మహా : ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల సుదీర్ఘ ప్రజాసేవా ప్రస్థానంలో మహిళల సంక్షేమం, హక్కుల పరిరక్షణకే అగ్రతాంబూలం దక్కిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పేర్కొన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజ ప్రగతి సాధ్యమని, మహిళా సాధికారతతోనే దేశాభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతుందని ప్రధాని బలంగా విశ్వసిస్తున్నారని తెలిపారు. ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో మహిళలు ముందంజలో ఉండి నాయకత్వం వహించేలా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని ఆయన కొనియాడారు.

‘సేవా సంకల్ప్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా శనివారం మల్లాపూర్‌లో బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డా.మేకల శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ‘అంగన్ మిలాన్’ సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాంచందర్ రావు మాట్లాడుతూ.. ‘బేటీ బచావో – బేటీ పడావో’ సహా నారీశక్తి సంక్షేమార్థం ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన విప్లవాత్మక పథకాలు నేడు సమాజంలో గణనీయమైన మార్పును తీసుకొచ్చాయని స్పష్టం చేశారు. భావితరాల కోసం ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించే బృహత్తర కార్యక్రమాలను కేంద్రం పెద్దఎత్తున అమలు చేస్తోందని ఆయన వివరించారు. తల్లీబిడ్డలు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నప్పుడే పటిష్టమైన భారతం ఆవిష్కృతమవుతుందని చెప్పారు. కోట్లాది మంది భారతీయులకు నిరంతర స్ఫూర్తిప్రదాతగా నిలుస్తున్న గౌరవ ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ, నిరంతరం దేశ సేవలో పునరంకితం కావాలని, దేశాన్ని ‘వికసిత్ భారత్’ వైపు విజయవంతంగా నడిపించేందుకు భగవంతుడు వారికి సంపూర్ణ ఆశీస్సులు అందించాలని ఈ సందర్భంగా రాంచందర్ రావు గారు ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి తాడూరి శ్రీనివాస్, బీజేపీ మహిళా మోర్చా నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.