విమానంలో హైజాక్ కలకలం.
* భారతీయ పైలట్ వీరోచిత పోరాటం.
* పైలట్‌పై కత్తితో దాడి.
* 180 మంది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు.
* ప్రాణాలకు తెగించి విమానాన్ని కాపాడిన భారతీయ కెప్టెన్.
దుబాయ్, మహా:
దుబాయ్ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానం ఎఫ్‌జెడ్1073లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విమాన కాక్‌పిట్‌లో ఇద్దరు పైలట్ల మధ్య హింసాత్మక ఘర్షణ చోటుచేసుకోవడంతో అత్యవసర సంకేతాలు వెలువడ్డాయి. తొలుత హైజాక్ భయాలు తలెత్తగా, విమానం మార్గం మార్చుకుని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. విమానంలోని ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు ఫ్లైదుబాయ్ ప్రకటించింది.
కాక్‌పిట్‌లోనే కత్తితో దాడి
ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం.. విమానంలో ఉన్న సహ పైలట్ కెప్టెన్‌పై కత్తితో దాడి చేసినట్లు ప్రాథమిక సమాచారం. దాడి సమయంలో విమానం నియంత్రణలో తీవ్ర అంతరాయం ఏర్పడటంతో అది ఒక్కసారిగా వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు దిగినట్లు విమాన సమాచార వివరాలు వెల్లడించాయి. ఈ పరిణామంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.
భారతీయ కెప్టెన్ పోరాటం
ప్రాథమిక నివేదికల ప్రకారం కెప్టెన్ భారతీయుడని కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. దాడికి గురైనప్పటికీ ఆయన ప్రతిఘటించి విమాన నియంత్రణను కాపాడేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ సమయంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది కూడా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంలో సహకరించినట్లు కథనాలు వెల్లడించాయి.
హైజాక్ సంకేతంతో కలకలం
విమానం నుంచి అత్యవసర సంకేతాలు వెలువడటంతో హైజాక్ జరిగిందనే అనుమానాలు మొదలయ్యాయి. అంతర్జాతీయంగా విమానాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకునే పరిస్థితిని సూచించే సంకేతం కూడా పంపబడినట్లు నివేదికలు తెలిపాయి. దీంతో ఇజ్రాయెల్ భద్రతా వ్యవస్థ అప్రమత్తమై, పరిస్థితిని నిశితంగా పరిశీలించింది.
విమానాన్ని సౌదీ వైపు మళ్లింపు
పరిస్థితి అదుపులోకి వచ్చిన అనంతరం విమానాన్ని సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయం వైపు మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఫ్లైదుబాయ్ ప్రకారం విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారు.
ఇద్దరు పైలట్లు ఆసుపత్రిలో
కాక్‌పిట్‌లో జరిగిన ఘర్షణలో ఇద్దరు పైలట్లు గాయపడినట్లు సమాచారం. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లైదుబాయ్ కూడా సంబంధిత అధికారులతో కలిసి పనిచేస్తున్నట్లు తెలిపింది.








