Mahaa Daily Exclusive

  గ్రామీణ ఉపాధి పనులపై సీతక్క సీరియస్‌…

Share

గ్రామీణ ఉపాధి పనులపై సీతక్క సీరియస్‌.
• 12 వేల మందికిపైగా సర్పంచులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌.
• అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలి.
• పనుల ఎంపికలో గ్రామసభల నిర్ణయాలకే ప్రాధాన్యం.
• పారదర్శకత.. నాణ్యత.. జవాబుదారీతనమే లక్ష్యం.
• ఉపాధి హామీ పనులపై క్షేత్రస్థాయి సమీక్ష.

హైదరాబాద్‌, మహా:
అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకోవాలని, పనుల ఎంపికలో గ్రామసభల నిర్ణయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఉపాధి పనుల్లో పారదర్శకత, నాణ్యత, జవాబుదారీతనాన్ని కచ్చితంగా పాటించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుపై సీతక్క బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. గ్రామాల్లో ఉపాధి పనుల గుర్తింపు, కూలీలకు ఉపాధి కల్పన, పనుల పురోగతి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై అధికారులతో సమగ్రంగా సమీక్షించారు.

ప్రతి కుటుంబానికి ఉపాధి

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి ఉపాధి అవకాశాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు పథకం ద్వారా పనులు అందించడంలో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. గ్రామాల్లో అవసరాలను గుర్తించి వాటికి అనుగుణంగా పనులను చేపట్టాలని సూచించారు.

గ్రామసభల నిర్ణయాలకే ప్రాధాన్యం

ఉపాధి హామీ పనుల ఎంపికలో గ్రామసభల నిర్ణయాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సీతక్క సూచించారు. గ్రామ ప్రజల అవసరాలను గ్రామస్థాయిలోనే గుర్తించి, వాటి ఆధారంగా పనులను ఎంపిక చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామానికి అవసరమైన పనులు చేపట్టడంతో పాటు ఉపాధి కల్పన, గ్రామాభివృద్ధి రెండూ ఏకకాలంలో జరిగేలా ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.

సర్పంచ్‌ల నుంచి సమస్యలపై ఆరా

క్షేత్రస్థాయిలో పథకం అమలులో ఎదురవుతున్న సమస్యలను మంత్రి నేరుగా సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, క్షేత్ర సహాయకులను అడిగి తెలుసుకున్నారు. పనుల గుర్తింపు, పనుల ప్రారంభం, కూలీలకు ఉపాధి కల్పన, పనుల పురోగతి వంటి అంశాలపై వివరాలు సేకరించారు. గ్రామస్థాయిలో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

పంచాయతీలదే కీలక బాధ్యత

గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో గ్రామ పంచాయతీల పాత్ర, బాధ్యతలపై మంత్రి సీతక్క స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గ్రామాల్లో అవసరమైన పనులను గుర్తించడం నుంచి వాటి అమలు, పర్యవేక్షణ వరకు పంచాయతీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలకు అందాల్సిన ఉపాధి అవకాశాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా అందేలా స్థానిక సంస్థలు పనిచేయాలని చెప్పారు.

పారదర్శకతకు పెద్దపీట

ఉపాధి పనుల్లో పారదర్శకత, నాణ్యత, జవాబుదారీతనానికి పెద్దపీట వేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పనుల ఎంపిక నుంచి అమలు వరకు నిబంధనలను కచ్చితంగా పాటించాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రజలకు ఉపయోగపడే పనులకే ప్రాధాన్యం ఇవ్వాలని, చేపట్టిన ప్రతి పనిలో నాణ్యత ఉండేలా పర్యవేక్షణ పెంచాలని ఆదేశించారు.

సమస్యలు వెంటనే పరిష్కరించాలి

క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించడంలో మండల, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. గ్రామస్థాయిలో సమస్య ఏర్పడిన తర్వాత అది మండల, జిల్లా స్థాయిల్లో పెండింగ్‌లో ఉండకుండా వెంటనే పరిష్కరించే వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు.

ఉపాధితోపాటు గ్రామాభివృద్ధి

గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాలకు శాశ్వత ప్రయోజనం కలిగే అభివృద్ధి పనులను చేపట్టాలని మంత్రి సీతక్క సూచించారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి, గ్రామాలకు అభివృద్ధి అందేలా వీబీ–జీ రామ్‌ జీ పథకం అమలును మరింత పటిష్ఠం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.