- శిక్షణతోనే సమర్థ పోలీస్ నాయకత్వం
- ప్రొబేషనరీ డీఎస్పీలకు డీజీపీ సీ.వి. ఆనంద్ దిశానిర్దేశం
- 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో గంటన్నరపాటు ముఖాముఖి
హైదరాబాద్, మహా : పోలీస్ అధికారుల కెరీర్‌కు శిక్షణే పునాది అని డీజీపీ సీ.వి. ఆనంద్ అన్నారు. సమర్థవంతమైన పోలీస్ అధికారులుగా ఎదగాలంటే క్రమశిక్షణ, నిబద్ధత, నాయకత్వ లక్షణాలతో పాటు నైతిక విలువలను అలవర్చుకోవాలని సూచించారు. ఆర్‌బీవీఆర్‌ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న 112 మంది ప్రొబేషనరీ డీఎస్పీలతో డీజీపీ బుధవారం ముఖాముఖి నిర్వహించారు. సుమారు గంటన్నరపాటు సాగిన ఈ కార్యక్రమంలో పోలీస్ నాయకత్వం, బాధ్యతలు, నైతికత, ప్రజలతో వ్యవహరించే తీరు తదితర అంశాలపై ఆయన విస్తృతంగా మాట్లాడారు. పదవిలో ఉన్నంత మాత్రాన నాయకత్వం రాదని, నాయకుడికి ప్రత్యేకమైన లక్షణాలు అవసరమని డీజీపీ పేర్కొన్నారు. ధైర్యం, స్పష్టమైన దార్శనికత, సమగ్రత, విలువలు–నైతికత, బృంద స్ఫూర్తి, నిష్పక్షపాత వైఖరి, సమర్థమైన కమ్యూనికేషన్, కష్టపడి పనిచేసే తత్వం, సాంకేతిక పరిజ్ఞానం, సృజనాత్మకతతో పాటు వినయం ముఖ్యమైన నాయకత్వ లక్షణాలని వివరించారు. ముఖ్యంగా నైతిక విలువలపై యువ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. విధి నిర్వహణలో చేసే చిన్న పొరపాట్లు కూడా భవిష్యత్తులో వారి ప్రతిష్ఠపై ప్రభావం చూపుతాయని చెప్పారు. పోలీస్ సర్వీసులో మూడు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ కెరీర్ ఉండే నేపథ్యంలో తమ ప్రతిష్ఠను కాపాడుకోవడం ప్రతి అధికారికి అత్యంత కీలకమన్నారు.
చట్ట పరిజ్ఞానంతో పాటు మానవీయ దృక్పథం
శిక్షణ పూర్తయిన అనంతరం క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సవాళ్లపై ప్రొబేషనర్లు అవగాహన పెంచుకోవాలని డీజీపీ సూచించారు. ప్రజలతో వ్యవహరించడం, నేరాల దర్యాప్తు, చట్టాల అమలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీసింగ్‌లో వినియోగించడం వంటి అంశాల్లో సమగ్ర నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు. చట్టాలపై పరిజ్ఞానం మాత్రమే మంచి పోలీస్ అధికారిగా తీర్చిదిద్దదని, నాయకత్వం, మానవీయ దృక్పథం, దర్యాప్తు నైపుణ్యం, సాంకేతిక అవగాహన, శారీరక దృఢత్వం, ప్రజలతో సమర్థమైన కమ్యూనికేషన్ కూడా అవసరమని పేర్కొన్నారు. “ప్రజలకు భద్రత కల్పించడం, వారికి సకాలంలో న్యాయం అందేలా చూడటమే పోలీసింగ్ అంతిమ లక్ష్యం” అని డీజీపీ అన్నారు.
పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ మాట్లాడుతూ.. ప్రొబేషనరీ డీఎస్పీల ప్రొఫెషనల్ కోర్సులో 74 మంది పురుషులు, 38 మంది మహిళలు కలిపి మొత్తం 112 మంది శిక్షణ పొందుతున్నారని తెలిపారు. సుమారు 10 నెలలపాటు జరిగే కోర్సులో ఇండోర్, అవుట్‌డోర్ శిక్షణకు సమ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్), క్రిమినల్ లా, క్రిమినాలజీతో పాటు నేర దర్యాప్తు, మోడల్ పోలీసింగ్, ఆస్తి సంబంధిత నేరాలు, ఆర్థిక నేరాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. సీనియర్ పోలీస్ అధికారులు, వివిధ రంగాల నిపుణులతో తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితులపై ప్రాక్టికల్ శిక్షణలో భాగంగా కాంబాట్ వ్యాయామాలు, గుర్రపు స్వారీ, ఈత, వివిధ రకాల ఆయుధాల వినియోగంపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.








