Mahaa Daily Exclusive

  రిఫైనరీలో పేలుడు.. 9మందికి గాయాలు … భయాందోళనలో స్థానికులు…

Share

 

మంగళూరు, మహా : కర్ణాటకలోని మంగళూరు సమీపంలో ఉన్న మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్‌ (ఎంఆర్‌పీఎల్‌)లో భారీ పేలుడు సంభవించింది. బుధవారం మధ్యాహ్నం ప్లాంట్‌లోని హైడ్రో సల్ఫర్ ట్రీట్‌మెంట్‌ (సీహెచ్‌టీ) యూనిట్‌లో జరిగిన ఈ ప్రమాదంలో మంటలు చెలరేగి తొమ్మిది మంది గాయపడ్డారు. మంగళూరుకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎంఆర్‌పీఎల్‌ యూనిట్‌లో మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. వెంటనే అప్రమత్తమైన ఎంఆర్‌పీఎల్‌ అత్యవసర స్పందన బృందం, న్యూ మంగళూరు పోర్టు అథారిటీ, కద్రి, పాండేశ్వర్‌ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ప్లాంట్‌లో పనిచేస్తున్న రాజేష్‌ బాప్టిస్ట్‌ అనే ఉద్యోగికి 35 శాతం మేర కాలిన గాయాలయ్యాయి. అతడిని వెంటనే శ్రీనివాస ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరో ఎనిమిది మంది స్వల్ప గాయాలతో బయటపడగా, వారికి ప్రాథమిక చికిత్స అందించారు.

పేలుడు తీవ్రతకు అంగారగుండి, బైకంపల్లి పారిశ్రామిక ప్రాంతం, కులై, కావూరు తదితర ప్రాంతాల్లో భారీ శబ్దం వినిపించింది. పేలుడు ధాటికి సమీపంలోని జోకట్టె గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రంథాలయం, పలు ఇళ్ల కిటికీలు, తలుపులు దెబ్బతిన్నాయి. భూమి కంపించినట్లు అనిపించడంతో స్థానికులు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రమాదం నేపథ్యంలో సమీపంలోని ఎంఆర్‌పీఎల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌కు సెలవు ప్రకటించారు.