Mahaa Daily Exclusive

  విజయవాడలో భారీ మోసం…

Share

  • విజయవాడలో భారీ మోసం
  • విశ్రాంత ఇంజినీరుకు రూ.10కోట్ల టోకరా

విజయవాడ, మహా : నగరంలో భారీ మోసం వెలుగు చూసింది. పోలీసుల పేరు చెప్పి విశ్రాంత ఇంజినీర్ కు ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు నాలుగు విడతల్లో రూ.10 కోట్లు దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. వారం రోజుల క్రితం విజయవాడ గురునానక్ కాలనీకి చెందిన ఓ విశ్రాంత ఇంజినీర్ కు అపరిచిత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మీ ఫోన్ నంబరు వివిధ నేరాల్లో తమకు లభించిందని, మీపై కేసులు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత వీడియోకాల్ చేసి.. డిజిటల్ అరెస్టు చేసినట్టు బెదిరించారు.

కేసుల నుంచి బయటపడాలంటే భారీగా డబ్బులు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో భయపడి పోయిన విశ్రాంత ఇంజినీర్ సైబర్ నేరగాళ్లు చెప్పినట్టు చేశారు. కృష్ణలంకలోని కెనరా బ్యాంకు ద్వారా నాలుగు లావాదేవీల్లో నిందితులు చెప్పిన బ్యాంకు ఖాతాల్లోకి రూ.10 కోట్లు డిపాజిట్ చేశారు. ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చిన బాధితుడు మంగళవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు సైబర్ నేరగాళ్ల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. బాధితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా నిందితులకు సంబంధించిన రెండు ఖాతాల్లో ఉన్న సుమారు రూ. 7 కోట్లు ఫ్రీజ్ చేశారు. విశ్రాంత ఇంజినీరు బ్యాంకులో తనకున్న ఫిక్స్ డ్ డిపాట్ చేసిన నగదు తీసిమరీ సైబర్ నేరగాళ్లకు చెల్లించినట్టు సమాచారం.