- భీమ్ రెడ్డిపై బినామీ యాక్ట్ నమోదు
- దేశంలో మొట్టమొదటిసారి
- అక్రమాస్తుల కేసులో ఇప్పటికే సస్పెండ్ అయిన భీమ్ రెడ్డి
హైదరాబాద్, మహా : అక్రమాస్తుల కేసులో సస్పెండ్ అయిన మాజీ డీఎస్పీ సంకిరెడ్డి భీమ్‌రెడ్డి కేసులో సంచలన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే భారీగా ఆస్తులను గుర్తించిన అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆ తర్వాత చేపట్టిన దర్యాప్తు ఆధారంగా ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) కూడా రంగంలోకి దిగింది. దీంతో ఈ కేసులో దర్యాప్తు సంస్థలు ఏసీబీ, ఐటీ మరింత దూకుడు పెంచాయి. భీమ్‌రెడ్డికి బినామీలుగా వ్యవహరించినట్లు అనుమానిస్తున్న 8 మందిపై బినామీ ఆస్తుల చట్టం కింద కేసులు నమోదు చేశాయి. ఇది దేశంలోనే తొలిసారిగా బినామీ లావాదేవీల చట్టం కింద ఇలాంటి కేసుల నమోదు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
డీజీపీ కార్యాలయంలోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సమయంలో భీమ్‌రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. జూన్ 27వ తేదీన నమోదైన ఈ కేసులో భాగంగా తెలంగాణ, కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. భూములు, ఇళ్లు, ప్లాట్లు, బ్యాంకు డిపాజిట్లు వంటి ఆస్తులకు సంబంధించిన వివరాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. మొత్తం 16 ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.200 కోట్లకు పైగా విలువైన ఆస్తులు గుర్తించినట్లు ఏసీబీ వర్గాల ద్వారా వెల్లడైంది. ఈ దర్యాప్తులో కొన్ని ఆస్తులు ఇతర వ్యక్తుల పేర్లపై ఉన్నప్పటికీ వాటి వెనుక భీమ్‌రెడ్డి పెట్టుబడులు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దీంతో బినామీ ఆస్తుల కోణంలోనూ దర్యాప్తును అధికారులు చేపట్టారు. బినామీ ఆస్తులకు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు ఏసీబీ అధికారులు కోర్టు నుంచి సెర్చ్ వారెంట్లు పొందారు. చార్టర్డ్ అకౌంటెంట్ వెంకటేష్ సహా మొత్తం 8 మంది ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్‌లోని పుప్పాలగూడతో పాటు ఇతర ప్రాంతాల్లో జరిగిన ఈ సోదాల్లో ఆస్తులకు సంబంధించిన పత్రాలు, నగదు, బంగారం, ఇతర కీలక ఆధారాలను అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆస్తుల కొనుగోలుకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. ఆ ఆస్తులకు అసలు యజమాని ఎవరు అనే అంశాలను దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. బినామీ చట్టం కింద నమోదైన కేసుల నేపథ్యంలో సంబంధిత ఆస్తులపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దర్యాప్తులో బినామీ లావాదేవీలు నిర్ధారణ అయితే ఆయా ఆస్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. భీమ్‌రెడ్డి వ్యవహారంలో ఏసీబీ ఇప్పటివరకు గుర్తించిన ఆస్తుల విలువ రూ.200 కోట్లకు పైగా ఉన్నట్లు దర్యాప్తు వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భూములు, ఇళ్లు, ఇతర స్థిరాస్తులతో పాటు బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నట్లు సమాచారం.
బినామీల పేరిట ఉన్న ఆస్తులు కూడా దర్యాప్తులో భాగం కావడంతో మొత్తం ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందా అనే కోణంలో అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో సుమారు 57 రోజుల పాటు భీమ్‌రెడ్డి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఆ తర్వాత సెప్టెంబర్ 1వ తేదీన బెయిల్‌పై విడుదల అయ్యారు. అయితే ఆయనపై నమోదైన కేసులో దర్యాప్తు మాత్రం కొనసాగుతోంది. ప్రస్తుతం ఏసీబీతో పాటు ఐటీ అధికారులు కూడా బినామీ ఆస్తులపై దృష్టి పెట్టడంతో కేసు మరింత కీలకంగా మారింది. మరోవైపు ఈ వ్యవహారంలో ఈడీ కూడా మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.








