ప్రపంచానికి ఆహార సంక్షోభం ముప్పు.
* విదేశాంగ మంత్రి జైశంకర్.
* ఆహారం, ఇంధనం, ఎరువులు, ఆర్థిక వ్యవస్థ పరస్పరం అనుసంధానం.
* రానున్న నెలల్లో పరిస్థితి తీవ్రమయ్యే ప్రమాదం .
* భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.
న్యూయార్క్,మహా:
ప్రపంచం ప్రస్తుతం మునుపెన్నడూ లేని విధంగా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న సంక్షోభాలను ఎదుర్కొంటోందని, ప్రస్తుత పరిస్థితులు ఇలాగే కొనసాగితే రానున్న నెలల్లో తీవ్రమైన ఆహార సంక్షోభం తప్పదని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ హెచ్చరించారు. న్యూయార్క్‌లో ఆసియా సొసైటీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచం ప్రస్తుతం ఆహారం , ఇంధనం , ఎరువులు ఆర్థిక వ్యవస్థ అనే నాలుగు పరస్పర అనుసంధానమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటోందని ఆయన వివరించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ధాన్యాల రవాణాకు ఆటంకాలు, ఇంధన సరఫరాపై ఒత్తిడి ఏర్పడుతోందని, దీనికి తోడు ఎరువుల కొరత వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ధాన్య వాణిజ్యానికి కీలకమైన నల్ల సముద్రం గుండా ఎగుమతులకు తీవ్ర విఘాతం కలుగుతోందని జైశంకర్ గుర్తుచేశారు. మరోవైపు మధ్యప్రాచ్య ఘర్షణలతో హోర్ముజ్ జలసంధి గుండా ఎరువుల సరఫరాకు ఆటంకం ఏర్పడితే, రైతులు సకాలంలో పంటలకు ఎరువులు వేయలేక దిగుబడులు దారుణంగా పడిపోతాయని విశ్లేషించారు. దానికి తోడు ఇంధన ధరల పెరుగుదల వల్ల సాగు, రవాణా ఖర్చులు పెరిగి చివరికి ఆ భారం ఆహార ధరలపైనే పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఒక ప్రాంతంలో జరిగే యుద్ధం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాలను సైతం ప్రభావితం చేస్తోందని, ముఖ్యంగా ఆహారం, ఎరువులు, ఇంధన దిగుమతులపై ఆధారపడే అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. జైశంకర్ వ్యాఖ్యలు తక్షణ ఆహార కొరతను సూచించనప్పటికీ.. భవిష్యత్తులో పొంచివున్న భారీ ముప్పుపై ముందస్తు హెచ్చరికగా భావించవచ్చు. ప్రపంచ దేశాలు సత్వరమే మేల్కొని సరఫరా మార్గాలను పునరుద్ధరించుకోవాలని, ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను అన్వేషించడంతో పాటు వ్యవసాయ ఇన్‌పుట్‌ల సరఫరాకు ఆటంకాలు లేకుండా చూసుకోవాలని జైశంకర్ పరోక్షంగా సూచించారు.







