Mahaa Daily Exclusive

  బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కొత్త కోణం:..

Share

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో కొత్త కోణం:.
* మల్లేశ్‌కు తోడైన ‘లోపలి’ వ్యక్తులు!
* దర్యాప్తులో వెలుగుచూసిన వినోద్, శేషుల పేర్లు.
* మద్రాస్ రెజిమెంట్‌లో సీన్ రీకన్‌స్ట్రక్షన్.
హైదరాబాద్, మహా.
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆయుధాగారంలో జరిగిన భారీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. జాతీయ భద్రతతో ముడిపడి ఉన్న ఈ దురాగతానికి పాల్పడింది మాజీ హవల్దార్ ఉప్పుతోళ్ల మల్లేశ్ అలియాస్ రాజు ఒక్కడే కాదని దర్యాప్తు సంస్థలు ఓ నిర్ధారణకు వచ్చాయి. ఆయుధాగారం నిర్వహణ బాధ్యతల్లో ఉన్న వినోద్, శేషులు అనే ఇద్దరు వ్యక్తులు మల్లేశ్‌కు సహకరించినట్లు పక్కా ఆధారాలు లభించడంతో మల్కాజిగిరి పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. లోపలి వ్యక్తుల సహకారం లేకుండా అత్యంత పటిష్ట భద్రత ఉండే సైనిక ప్రాంతంలోకి చొరబడి ఆయుధాలు తీసుకెళ్లడం అసాధ్యమన్న కోణంలో తొలి నుంచి సాగిన దర్యాప్తు ఇప్పుడు కొలిక్కి వస్తోంది.
ముఖ్యంగా మల్లేశ్, వినోద్‌ల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలు ప్రస్తుతం కేసులో అత్యంత కీలకంగా మారాయి. చోరీకి ముందు, ఆ తర్వాత వీరి మధ్య జరిగిన నగదు బదిలీలు, ఫోన్ కాల్స్, కదలికలపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఇవి కేవలం వ్యక్తిగత లావాదేవీలా లేక ఆయుధాల చోరీ కోసం కుదిరిన ఒప్పందాలా అనే కోణంలో విచారణ సాగుతోంది. మరోవైపు పది రోజుల కస్టడీలో భాగంగా ఎనిమిదో రోజు మల్లేశ్‌ను పోలీసులు ముమ్మరంగా ప్రశ్నిస్తున్నారు. కొత్తగా సహచరుల పేర్లు బయటకు రావడంతో వారి పాత్రపై కూపీ లాగుతున్నారు. దర్యాప్తులో భాగంగా మల్లేశ్‌ను మద్రాస్ రెజిమెంట్ ప్రాంగణానికి తీసుకెళ్లిన అధికారులు, అక్కడ సీన్ రీకన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. ఏ మార్గం గుండా లోపలికి వెళ్లాడు, తాళాలు ఎలా పగలగొట్టాడు, ఆయుధాలను ఏ ప్రాంతం నుంచి తీసుకుని ఎలా బయటకు తరలించాడు తదితర అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించి ఇప్పటికే లభించిన ఆధారాలతో సరిపోల్చుకుంటున్నారు.
ఆగస్టు 30, 31వ తేదీల మధ్య రాత్రి జరిగిన ఈ ఘటనపై తెలంగాణ పోలీసు, సైనిక, కేంద్ర నిఘా వర్గాలు సమన్వయంతో దర్యాప్తు చేపట్టాయి. ఆయుధాగారం నుంచి ఏకే-203 రైఫిళ్లు, ఇన్‌సాస్ రైఫిల్, పిస్టళ్లు సహా మొత్తం 12 తుపాకులు, 21 మ్యాగజైన్లు, నైట్ విజన్ బైనాక్యులర్, 1,876 రౌండ్ల మందుగుండు సామగ్రి మాయమైనట్లు గుర్తించారు. ఆగస్టు 28, 29 తేదీల్లోనే రెక్కీ నిర్వహించిన మల్లేశ్, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలను గమనించి 30వ తేదీ రాత్రి ఈ భారీ చోరీకి పాల్పడ్డాడు. సాంకేతిక ఆధారాలు, లక్షలాది ఫోన్ కాల్ డేటాను విశ్లేషించిన అధికారులు.. మల్లేశ్ కదలికలను పసిగట్టి అతడిని అరెస్ట్ చేశారు. అతడి స్వస్థలంలో సోదాలు నిర్వహించి భూమిలో పాతిపెట్టిన ఆయుధాలను వెలికితీసిన విషయం విదితమే. సుమారు 16 ఏళ్ల పాటు సైన్యంలో పనిచేసిన మల్లేశ్, క్రమశిక్షణా రాహిత్యం తదితర కారణాలతో ఈ ఏడాది జూన్ 30న విధుల నుంచి తొలగింపునకు గురయ్యాడు. ఆ అసంతృప్తితోనే ఈ ఘటనకు పాల్పడ్డాడన్నది దర్యాప్తులో తేలిన ప్రధాన అంశం.
తాజాగా వినోద్, శేషుల పాత్ర వెలుగులోకి రావడంతో ఈ కుట్ర వెనుక ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అనే దిశగా దర్యాప్తు వేగవంతమైంది. చోరీ సమయంలో ఆయుధాగారం వద్ద రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదన్న లోపాలను కూడా అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలాగే, సమీపంలోని ఫైరింగ్ రేంజ్ వద్ద దొరికిన 160 విద్యుత్ డిటోనేటర్లకు ఈ కేసుతో ఏమైనా సంబంధం ఉందా అన్నది తేలాల్సి ఉంది. మల్లేశ్ కస్టడీ గడువు ముగిసేలోపు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు రాబట్టేందుకు దర్యాప్తు బృందాలు శ్రమిస్తున్నాయి. ఈ ముగ్గురి విచారణతో పాటు సైనిక శాఖ అంతర్గత దర్యాప్తు పూర్తయితే ఈ భారీ ఆయుధాల చోరీ వెనుక ఉన్న అసలు కథ, భద్రతా వైఫల్యాలకు గల కారణాలు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.