- ఓ.సి జారీకి భవనాలను పరిశీలించిన కమిషనర్ వెంకన్న
వరంగల్, కార్పొరేషన్ మహా;
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిర్మించిన భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియలో భాగంగా బల్దియా కమిషనర్ టీ. వెంకన్న మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు.
గోర్రెకుంట, గోపాల్ పూర్, ప్రశాంత్ నగర్, భవాని నగర్ తదితర ప్రాంతాల్లో నిర్మించిన భవనాలను కమిషనర్ పరిశీలించి, అనుమతులు, బిల్డింగ్ ప్లాన్‌కు అనుగుణంగా నిర్మాణం జరిగిందా, నిబంధనలు పాటిస్తున్నారా అనే అంశాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, భవన నిర్మాణాలను మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి పొందిన బిల్డింగ్ ప్లాన్ ప్రకారమే చేపట్టాలని సూచించారు. అనుమతించిన ప్లాన్‌కు విరుద్ధంగా అదనపు నిర్మాణాలు చేపట్టకుండా, భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని నిబంధనలు, ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
భవనం నిర్మాణం పూర్తయిన అనంతరం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో, అనుమతి పొందిన ప్లాన్‌కు వాస్తవంగా నిర్మించిన భవనానికి మధ్య ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా చూసుకోవాలని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు.
ఈ పరిశీలనలో సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, టి పివోలు అవినాష్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.







