- కేటీఆర్ పాస్ పోర్టు తాత్కాలికంగా సీజ్
- ఫార్ములా-ఈ రేస్ కేసులో ఏసీబీ దూకుడు
- కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురివి కూడా
హైదరాబాద్, మహా : ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో కీలక పరిమాణం చోటుచేసుకుంది. ఈ కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఇతర నిందితుల పాస్‌పోర్ట్‌లను తాత్కాలికంగా జప్తు చేయాలని ఏసీబీ కోర్టును కోరారు. దర్యాప్తు సంస్థ అభ్యర్థన మేరకు స్పందించిన ఏసీబీ కోర్టు, ఆ నలుగురు నిందితుల పాస్‌పోర్ట్‌లు తాత్కాలికంగా జప్తు చేయనున్నారు. ఇందులో భాగంగా వారి పాస్ పోర్టులు తాత్కాలికంగా సీజ్ చేయాలని ఆదేశిస్తూ హైదరాబాద్ రీజినల్ పాస్‌పోర్టు కార్యాలయానికి ఏసీబీ కోర్టు లేఖ రాసింది. ఈ పరిణామంతో ఫార్ములా-ఈ కేసు మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా-ఈ రేసు వ్యవహారంలో అవినీతి, అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపించింది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్ల ప్రభుత్వ నిధులను విదేశీ సంస్థలకు బదిలీ చేశారని కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ దర్యాప్తు ఆధారంగా 2024 డిసెంబరులో కేటీఆర్, అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ తో పాటు హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఫార్ములా-ఈ ఆపరేషన్స్ ప్రతినిధి అల్బెర్టో లోంగోలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.
నిందితులను విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్న ఏసీబీ
ఈ కేసులో ఏసీబీ అధికారులు ఇదివరకే నిందితులను విచారించి వారి స్టేట్మెంట్ నమోదు చేయడంతో పాటు కోర్టులో ఛార్జిషీట్లు దాఖలు చేశారు. అయితే తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్న నిందితులు విదేశాలకు పారిపోకుండా లేదా ప్రయాణించకుండా వారిని అడ్డుకునేందుకు వారి పాస్‌పోర్ట్‌లను జప్తు చేసే అధికారం కేవలం ఆర్పీవోకు ఉంటుంది. కేసు తీవ్రత, మాజీ మంత్రితో పాటు ఐఏఎస్ అధికారి స్థాయిలలో ఉన్నవారు నిందితులుగా ఉండటంతో ఏసీబీ కోర్టు ద్వారా ఆర్పీవోకు లేఖ పంపించింది. దాంతో త్వరలో కేటీఆర్ తో పాటు మిగతా ముగ్గురు నిందితుల పాస్ పోర్టు తాత్కాలికంగా సీజ్ చేయనున్నారు. ఆర్పీవో నుంచి సమాచారం వచ్చాక కేటీఆర్ సహా మిగతా నిందితులు తమ పాస్ పోర్టులను సరెండర్ చేయాల్సి ఉంటుంది.
ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో ఎలాంటి నిధుల దుర్వినియోగం ఆరోపణలపై కేటీఆర్ గతంలోనే స్పందించారు. హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్ స్థాయిలో నిలపడానికి, ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకే ఫార్ములా-ఈ రేసును నిర్వహించామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసు పెట్టి ఇబ్బందులకు గురిచేయాలని చూస్తుందని విమర్శించారు. ఫార్ములా ఈ రేసు కేసులో కాంగ్రెస్ నేతల ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల హామీలు అమలు చేయలేక డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని మండిపడ్డారు. అని విమర్శించారు. సంస్థ ఖాతాలోనే నిధులు ఉన్నాయని, లబ్ధిదారుడిగా ఛార్జిషీటులో ఎవరినీ చూపలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని, కోర్టులపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.







