చిత్తూరులో ఏనుగుల సంచారంపై పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
• రంగంలోకి ముసలమడుగు కుంకీ ఏనుగులు
• గుంపును అడవిలోకి సురక్షితంగా మళ్లించేందుకు ఆపరేషన్
• పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం
• అటవీ శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్ష
చిత్తూరు, మహా.
చిత్తూరు జిల్లాలోని పలు గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను, రైతులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్న ఏనుగుల గుంపును వెంటనే అడవిలోకి సురక్షితంగా మళ్లించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ఏనుగులను మళ్లించే ఆపరేషన్ కోసం ముసలమడుగు శిబిరం నుంచి ‘కుంకీ’ ఏనుగులను రంగంలోకి దించాలని ఆయన స్పష్టమైన సూచనలు జారీ చేశారు. సోమవారం పడిపుట్లబైలు సమీపంలో ఏనుగుల సంచారంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు.
15 రోజులుగా ఏనుగుల బీభత్సం..
గత 15 రోజులుగా 11 ఏనుగులతో కూడిన గుంపు, దాని నుంచి విడిపోయిన మరో రెండు ఏనుగులు పడిపుట్లబైలు పంచాయతీ పరిధిలోని పుండ్లవల్లపల్లి, నడింపల్లి, కొండకిందపల్లి గ్రామాల్లో సంచరిస్తున్నాయని అధికారులు ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ ఏనుగులు వ్యవసాయ పంటలకు తీవ్ర నష్టం కలిగిస్తుండటంతో రైతులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. ఒక ఏనుగుల గుంపు రహదారి దాటి మంగళంపేట బీట్‌లోకి ప్రవేశించగా, మరో రెండు ఏనుగులు చిత్తూరు వైపు కదులుతున్నాయని, దీనివల్ల పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల ప్రజలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
సమన్వయంతో పనిచేయాలి.. తక్షణం పరిహారం ఇవ్వాలి
పరిస్థితిని సమీక్షించిన పవన్ కల్యాణ్.. ప్రజల భద్రతకే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఏనుగులు-మానవ ఘర్షణలు తలెత్తకుండా కఠినమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏనుగుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, అటవీ, పోలీసు, రెవెన్యూ, విద్యుత్ శాఖలతో పాటు హనుమాన్ బృందాలు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. నిరంతరం నిఘా ఉంచి, ప్రమాదం పొంచి ఉన్న గ్రామాల ప్రజలను ముందస్తుగా అప్రమత్తం చేయాలన్నారు.
ముఖ్యంగా ఏనుగుల వల్ల పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకుంటూనే, ఏనుగులను సురక్షితంగా తిరిగి అటవీ ప్రాంతంలోకి మళ్లించే ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. వన్యప్రాణుల సంరక్షణతో పాటు ప్రజల భద్రత, పంటల పరిరక్షణకు అన్ని శాఖలు బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆయన ఉద్ఘాటించారు.








