దసరా కల్లా మెట్రో ఫేజ్-1 స్వాధీనం.
* రుణ సమీకరణపై సర్కారు ఫోకస్
• ఎస్‌బీఐ క్యాప్స్ ద్వారా తక్కువ వడ్డీ రుణాల కోసం ప్రయత్నాలు
• ఐఆర్‌ఎఫ్‌సీ రుణం పెండింగ్.. ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి
• ఓల్డ్ సిటీ మెట్రో వ్యయం అంచనా పెంపు
హైదరాబాద్, మహా:
హైదరాబాద్ మెట్రో ఫేజ్-1లోని ఎల్ అండ్ టీ సంస్థ వాటాను విజయదశమి నాటికి పూర్తిగా స్వాధీనం చేసుకునేలా ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ప్రభుత్వం అధికారులకు లక్ష్యం విధించింది. ఈ స్వాధీన ప్రక్రియలో భాగంగా, ఎల్ అండ్ టీ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న సుమారు రూ. 13,600 కోట్ల రుణాలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుణ సమీకరణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఎస్‌బీఐ క్యాప్స్‌కు అప్పగించారు. ప్రస్తుతం ఉన్న 7-8% వడ్డీ రేటు కంటే తక్కువ వడ్డీకి రుణాలు సేకరించడం ద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించాలని భావిస్తున్నారు.
ఎస్‌బీఐ క్యాప్స్ గుజరాత్‌లోని గిఫ్ట్‌సిటీ సహా ముంబైకి చెందిన పలు బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే, వడ్డీ రేట్ల విషయంలోనే ప్రధాన ప్రతిబంధకం ఎదురవుతోంది. మొదట ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్‌ఎఫ్‌సీ) 4 శాతం లోపు వడ్డీకే రుణం (జపాన్ యెన్‌లు, రూపాయల మిశ్రమంగా) ఇచ్చేందుకు ముందుకొచ్చినప్పటికీ, ఆఖరి నిమిషంలో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (యూబీఐ) రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపినప్పటికీ, వారు కోరుతున్న వడ్డీ రేటు 7 శాతానికి పైగా ఉండటంతో అధికారులు పునరాలోచనలో పడ్డారు.
తక్కువ వడ్డీకి రుణ సమీకరణ యత్నాలు ఫలించని పక్షంలో ప్రత్యామ్నాయ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిధులను ఉపయోగించుకునే సాధ్యాసాధ్యాలను కూడా అధ్యయనం చేస్తోంది. మరోవైపు ఐఆర్‌ఎఫ్‌సీ ద్వారా రుణం పొందేందుకు పాత అగ్రిమెంట్ ప్రకారం ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది.
షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ మరియు ఆలస్యం
మెట్రో ఫేజ్-1లోని ఎల్ అండ్ టీ వాటాను రూ. 1461.47 కోట్లతో కొనుగోలు చేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్ 29న తెలంగాణ ప్రభుత్వం షేర్ పర్చేజ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అప్పటి నుంచి రుణాలపై వడ్డీ భారం ప్రభుత్వంపై పడుతోంది. వాస్తవానికి జూన్ 30 నాటికి రుణ సమీకరణ ప్రక్రియ పూర్తవుతుందని సెబీకి ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ ముందుగా తెలిపింది. అయితే, రుణం ఆగిపోవడంతో సెప్టెంబర్ 30 కల్లా పూర్తవుతుందని మరోసారి సెబీ దృష్టికి తీసుకెళ్లింది.







