Mahaa Daily Exclusive

  తెలంగాణ అస్తిత్వం అంటే అమరవీరులే.. కేసీఆర్ కాదు!

Share

తెలంగాణ అస్తిత్వం అంటే అమరవీరులే.. కేసీఆర్ కాదు!
• బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబంపై ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఫైర్
• ఈ సెప్టెంబర్‌లోనే సిరిసిల్లకు సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, మహా:
తెలంగాణ అస్తిత్వం అంటే రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరులేనని, కేసీఆర్ కాదని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఆదివారం సీఎల్పీ మీడియా సెంటర్ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. చావు నోట్లో కేసీఆర్ తలకాయ పెడితే తెలంగాణ వచ్చిందనేది అబద్ధమని, సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకపోతే కేసీఆర్ ఎక్కడ తలకాయ పెట్టినా ఎలాంటి ఉపయోగం ఉండేది కాదన్నారు. తెలంగాణ అంటే తామే అన్న కల్వకుంట్ల కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాతాళానికి తొక్కేశారని ఆయన వ్యాఖ్యానించారు. బంధువులు, అనుచరులతో కేసీఆర్ నిర్మించుకున్న సామ్రాజ్యాన్ని బద్దలు కొట్టడమే తమ లక్ష్యమని పేర్కొన్న ఆయన.. ఈ సెప్టెంబర్‌లోనే సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లలో అడుగుపెట్టబోతున్నారని వెల్లడించారు.
మాజీ మంత్రి కేటీఆర్ తీరుపై అద్దంకి దయాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ని రద్దు చేస్తానని ప్రకటించడం ద్వారా కేటీఆర్ తెలంగాణ ద్రోహిగా మారారని ఆరోపించారు. “కేటీఆర్ మమ్మల్ని బెదిరిస్తావా..? ముందు నీ భవిష్యత్తు చూసుకో. రెండేళ్లే కాదు ఇరవై ఏళ్ల తరువాత కూడా మీ పార్టీ అధికారంలోకి రాదు” అంటూ ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులు తమ పదేళ్ల పాలనలో అవినీతితో సంపాదించిన అక్రమ సొమ్ముతోనే ఇప్పుడు ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
గతంలో దళితుణ్ని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పిన కేసీఆర్.. గెలిచిన తర్వాత ఆ మాట ఎందుకు నిలబెట్టుకోలేదో సమాధానం చెప్పాలని దయాకర్ నిలదీశారు. దళితులకు భూమి ఇవ్వకపోగా.. గతంలో కాంగ్రెస్ హయాంలో ఇందిరమ్మ ఇచ్చిన భూములను సైతం బీఆర్ఎస్ నేతలు లాక్కున్నారని ఆరోపించారు. ప్రభుత్వ, అసైన్డ్, ఇనాం భూములను ఏమాత్రం వదలకుండా ఆ పార్టీ నాయకులు కబ్జాలకు పాల్పడ్డారని విమర్శించారు. అలా కబ్జాకు గురైన కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను ఇప్పుడు ‘హైడ్రా’ ద్వారా రేవంత్ సర్కార్ విముక్తి చేస్తోందని ప్రశంసించారు. భూములను ఆక్రమించుకున్న తెలంగాణ ద్రోహులను కేసీఆర్ పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.