- మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం
- ఎన్నికల్లో ఓడిపోతే ఈవీఎంలు, రాజ్యాంగ వ్యవస్థలపై బురదజల్లడం కాంగ్రెస్ నైజం
- కాంగ్రెస్ పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, మహా : “మిస్టర్ రాహుల్ గాంధీ.. భారతీయ జనతా పార్టీ ఎన్నడూ ఓట్లను చోరీ చేయదు, దేశ ప్రజల మనసులను గెలుచుకుంటుంది. ఎన్నికల్లో గెలిస్తే తమ ఘనతగా చెప్పుకోవడం, ఓడిపోతే ఈవీఎంలు, ఎన్నికల సంఘంపై నిందలు వేయడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు, ద్వంద్వ వైఖరికి నిదర్శనం. ప్రజలు ఛీత్కరించుకుంటున్నా కాంగ్రెస్ వైఖరిలో మార్పు రావడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. తొలుత భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా పూర్తయినందుకు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి, పోలీస్, మున్సిపల్ సిబ్బందికి, ప్రభుత్వ యంత్రాంగానికి, సహకరించిన నగర ప్రజలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఎన్నికల సంఘం, రాజ్యాంగ వ్యవస్థలపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరాధార ఆరోపణలను కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల సంఘం చాలా బాగా పనిచేసినట్లు, కేరళలో కాంగ్రెస్ సీనియర్ నేత చెప్పినట్లు ఎస్ఐఆర్ ద్వారా దొంగ ఓట్లను తొలగిస్తే ఈసీ మంచిదైనట్లు ప్రచారం చేసుకున్నారని గుర్తుచేశారు. అదే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే మాత్రం ఈవీఎంలు, ఎన్నికల సంఘం తప్పన్నట్లు మాట్లాడటం వారి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌ది కాదని, రాహుల్ గాంధీని ప్రధాని చేయాల్సిన బాధ్యత ఈవీఎంలది కాదని స్పష్టం చేశారు.
రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌కు ఏమాత్రం లేదని ఆయన పేర్కొన్నారు. 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించి, పత్రికా స్వేచ్ఛను హరించి, పౌర హక్కులను కాలరాసి, ప్రతిపక్ష నేతలను జైళ్లలో పెట్టి చీకటి రాజ్యాన్ని నడిపిన చరిత్ర కాంగ్రెస్‌దని నిలదీశారు. 2009లో తమ మాట వినడం లేదని ఏకంగా రాజ్యాంగబద్ధ ఎన్నికల కమిషనర్లను తొలగించాలని రాష్ట్రపతికి సిఫారసు చేసిన చరిత్రను గుర్తుచేశారు. ప్రస్తుతం తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా ఇందిరా పార్క్ వద్ద ధర్నాలు చేయాలన్నా కోర్టులకు వెళ్లి అనుమతులు తెచ్చుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఉందని, అలాంటి వారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. మరోవైపు తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర రాష్ట్రాలకు వెళ్లి “సోనియా గాంధీ కుటుంబం కోసం ప్రాణాలు అర్పిస్తా” అనడం సిగ్గుచేటని, ప్రజల సమస్యలను గాలికొదిలేసి గాంధీ కుటుంబ సేవలోనే గడుపుతున్నారని ఆక్షేపించారు.
దేశ ప్రయోజనాల కోసం పని చేస్తున్న రాజ్యాంగ, భద్రతా వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. “రాహుల్ గాంధీ ఏ ఒక్క వ్యవస్థనూ వదిలిపెట్టడం లేదు. ఆర్మీ చీఫ్, ఎయిర్‌ఫోర్స్, సర్జికల్ స్ట్రైక్స్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, లోక్‌సభ స్పీకర్, సీజేఐ, ఈడీ, సీబీఐ, ఇంటెలిజెన్స్ బ్యూరో, మీడియా హౌస్‌లతో పాటు చివరకు పార్లమెంట్, జీఎస్టీ వ్యవస్థలపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తూ విషప్రచారం చేస్తున్నారు. విదేశీ వేదికల మీద దేశ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడటం ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనం” అని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. “ఈ దేశాన్ని మా కుటుంబం మాత్రమే పాలించాలి, తమ తాత, నానమ్మ, తండ్రి ప్రధానులయ్యారు కాబట్టి నేనే ప్రధాని కావాలనే రాచరికపు భావజాలం, అహంకారం రాహుల్ గాంధీ మాటల్లో స్పష్టంగా కనిపిస్తోందని విమర్శించారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రజల మధ్యే ఉంటూ సుపరిపాలన అందిస్తోందని తెలిపారు. దేశంలో పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పన, ఉచిత రేషన్, రహదారులు, ఎయిర్‌పోర్టులు, మహిళా సంఘాలకు ప్రోత్సాహం వంటి ఎన్నో పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చామని పేర్కొన్నారు. గత 11-12 ఏళ్ల పాలనలో మోదీ ప్రభుత్వంపై ఒక్కటంటే ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని, గత యూపీఏ పాలన అంతా కుంభకోణాల మయంగా సాగిందని ఎద్దేవా చేశారు. స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టే బీజేపీని పదే పదే ఆశీర్వదిస్తున్నారని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఉత్తరప్రదేశ్‌లో 1989 నుంచి, బీహార్‌లో 1990 నుంచి, పశ్చిమ బెంగాల్లో 1977 నుంచి, గుజరాత్లో 1998 నుంచి, ఏపీలో 2009 నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అడ్రస్సే లేకుండా చేశారని గుర్తుచేశారు. అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం సృష్టించి, చివరకు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి తీసుకొచ్చారని, రాబోయే రోజుల్లో ఈ మూడు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గురించి మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు, పర్యవేక్షణలోనే లక్షలాది అక్రమ ఓట్లను తొలగించడం జరుగుతోందని తెలిపారు. “బెంగాల్లో చనిపోయిన 24 లక్షల మంది ఓట్లు, పర్మనెంట్‌గా వలస వెళ్లిన 19 లక్షల మంది ఓట్లు, చిరునామా లేని 12 లక్షల మంది ఓట్లు, దాదాపు 2 కోట్ల డూప్లికేట్ ఓట్లు తొలగిస్తే తప్పేముంది? తండ్రికి, పిల్లలకు మధ్య కేవలం 15 ఏళ్ల వయస్సు తేడా ఉన్నట్లు చూపించిన తప్పుడు రికార్డులను సవరిస్తే కాంగ్రెస్‌కు వచ్చిన ఇబ్బందేమిటి?” అని ప్రశ్నించారు. వ్యవస్థలోని లోపాలను సరిదిద్దితే స్వాగతించాల్సింది పోయి రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేయడం మానుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.







