Mahaa Daily Exclusive

  బొత్స సొంత నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్.. టీడీపీ బాటలో కీలక నేతలు!

Share

బొత్స సొంత నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్.. టీడీపీ బాటలో కీలక నేతలు!
• మెరకముడిదాం మండలంలో వైసీపీ నేతల సామూహిక రాజీనామా
• పార్టీని వీడిన వారిలో మండల అధ్యక్షుడు, 13 గ్రామాల నేతలు
• బొత్స మేనల్లుడు ‘చిన్న శ్రీను’ అడుగుజాడల్లోనే పయనిస్తామని ప్రకటన
చీపురుపల్లి,మహా.

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొంత నియోజకవర్గమైన చీపురుపల్లిలో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మెరకముడిదాం మండలంలో పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు సామూహికంగా రాజీనామా చేశారు. దీంతో స్థానిక నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
జగన్‌కు రాజీనామా లేఖలు
మెరకముడిదాం వైసీపీ మండల అధ్యక్షుడు కోట్ల వెంకట్రావుతో పాటు 13 గ్రామాలకు చెందిన పలువురు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ముఖ్య నేతలు ఆదివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పంపుతున్నట్లు వారు స్పష్టం చేశారు.
చిన్న శ్రీను బాటలోనే పయనం
ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అడుగుజాడల్లోనే తామంతా నడుస్తామని రాజీనామా చేసిన నేతలు ఈ సందర్భంగా ప్రకటించారు. త్వరలోనే వారంతా టీడీపీలో చేరనున్నట్లు వెల్లడించారు. కాగా, గతంలో చీపురుపల్లికి చెందిన ఓ మాజీ జెడ్పీటీసీ దంపతులు సైతం వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
2029 ఎన్నికల ప్రకటన వేళ..
వచ్చే 2029 అసెంబ్లీ ఎన్నికల్లో తాను మళ్లీ చీపురుపల్లి నుంచే పోటీ చేస్తానని బొత్స సత్యనారాయణ ఇటీవలే ప్రకటించారు. సరిగ్గా ఈ తరుణంలో ఆయన సొంత నియోజకవర్గంలోనే పార్టీ సంస్థాగత నిర్మాణం బలహీనపడటం వైసీపీకి ఇబ్బందికర పరిణామంగా మారింది. ఈ వరుస రాజీనామాలు రానున్న రోజుల్లో నియోజకవర్గ రాజకీయ సమీకరణాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.