29న అట్టహాసంగా ‘పల్లె పండుగ 3.0’ ప్రారంభం
• గ్రామాల అభివృద్ధికి రూ. 10 వేల కోట్ల నిధులు
• రామాపురంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటన
• ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఉదయగిరి ఎమ్మెల్యే
• సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పిలుపు
నెల్లూరు, మహా .
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమానికి ఈ నెల 29న శ్రీకారం చుట్టనున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రామాపురం గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల రాక నేపథ్యంలో రామాపురంలో సందడి వాతావరణం నెలకొంది.
రూ. 10 వేల కోట్లతో పల్లెలకు మహర్దశ
రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల రూపురేఖలను సమూలంగా మార్చాలనే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఇందుకోసం ఏకంగా రూ. 10,000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఈ నిధులతో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం మెరుగుపరచడం, తాగునీటి వసతి, రహదారుల నిర్మాణం వంటి కీలక పనులను చేపట్టనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పంచాయతీ గ్రాంట్లు, గ్రామీణాభివృద్ధి పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది.
ముమ్మరంగా ఏర్పాట్లు
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సభా ప్రాంగణం, భద్రతా చర్యలు, పార్కింగ్ తదితర సౌకర్యాలను నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సభను విజయవంతం చేయాలి
ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కూటమి నేతలు సమాయత్తమవుతున్నారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఉదయగిరి నియోజకవర్గంలోని జనసేన, బీజేపీ నాయకులతో సమావేశమై సభకు ప్రజా సమీకరణపై ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ప్రభుత్వం చేపడుతున్న ఈ మహత్తర కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలి. సెప్టెంబరు 29న రామాపురం గ్రామానికి ప్రజలు భారీగా తరలివచ్చి ‘పల్లె పండుగ 3.0’ను విజయవంతం చేయాలి” అని పిలుపునిచ్చారు. కూటమి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమిష్టిగా పనిచేయాలని ఆమె కోరారు.







