Mahaa Daily Exclusive

  నెల్లూరులో తీవ్ర విషాదం…*విద్యుదాఘాతంతో అక్కాచెల్లెళ్ల మృతి.

Share

నెల్లూరు,మహా.
నెల్లూరు జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. సరదాగా ఆడుకునేందుకు నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి మిద్దెపైకి వెళ్లిన ఇద్దరు పసి ప్రాణాలను కరెంట్ బలితీసుకుంది. వాటర్ ట్యాంకు నుంచి నీరు ఓవర్‌ఫ్లో కావడం, అక్కడే విద్యుత్ సరఫరా ఉన్న తీగలు ఉండటంతో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. నెల్లూరులోని హరినాథపురంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం మిద్దెపైకి ఊర్లగుంట జ్యోతి (11), అమూల్య (7) అనే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆడుకునేందుకు వెళ్లారు. అదే సమయంలో అక్కడున్న వాటర్ ట్యాంక్ ఓవర్‌ఫ్లో కావడంతో మిద్దె అంతా నీరు చేరింది. ఆ నీరు సమీపంలో విద్యుత్ సరఫరా కొనసాగుతున్న తీగలకు తగలడంతో ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. నీళ్లలో ఆడుకుంటున్న చిన్నారులు ఇద్దరూ ఆ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే వారిని రక్షించి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, వారిని పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారులు మృతి చెందినట్లు ధృవీకరించారు. కళ్లెదుటే ఆడుకుంటున్న పిల్లలు విగతజీవులుగా మారడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఒకేసారి ఇద్దరు పిల్లలు దూరం కావడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు స్థానికులను సైతం కంటతడి పెట్టించాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాలాజీనగర్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉండటంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. భవన నిర్మాణాల వద్ద ప్రమాదకర పరిస్థితులు ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘోరం జరిగిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలను వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.