Mahaa Daily Exclusive

  వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త…

Share

వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.
* 815 కొత్త జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఏర్పాటు.
విజయవాడ, మహా.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వార్డు సచివాలయ ఉద్యోగులకు దీపావళి కానుకగా శుభవార్త అందించింది. సచివాలయ వ్యవస్థలో పనిచేస్తున్న అర్హులైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఖజానాపై అదనపు ఆర్థిక భారం పడకుండా, మిగులు పోస్టులను సర్దుబాటు చేస్తూ ఈ పునర్వ్యవస్థీకరణను చేపట్టింది.
ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో 815 కొత్త జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సృష్టించారు. అర్హులైన ‘వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ’లకు ఈ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ప్రమోషన్లు ఇవ్వనున్నారు. తద్వారా ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు అర్హులైన ‘వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ’లకు వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలుగా పదోన్నతి కల్పిస్తారు.
దీంతో పాటుగా, రెండు కీలక విభాగాల్లో గ్రేడ్-2 పోస్టులను గ్రేడ్-1 స్థాయికి అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో 815 వార్డు శానిటేషన్ & పర్యావరణ కార్యదర్శి గ్రేడ్-2 పోస్టులు, అలాగే 815 వార్డు ప్లానింగ్ & నియంత్రణ కార్యదర్శి గ్రేడ్-2 పోస్టులు ఉన్నాయి. ఈ నిర్ణయంతో ఆయా విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉన్నత స్థాయి హోదా, మెరుగైన వృత్తిపరమైన పురోగతి లభించనుంది.
ఎంతో కాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ తాజా నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పునర్వ్యవస్థీకరణతో పట్టణ పరిపాలనా వ్యవస్థ మరింత బలోపేతం కానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సీనియారిటీ, అర్హత తదితర అంశాల ఆధారంగా పదోన్నతుల ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది.