Mahaa Daily Exclusive

  ప్రపంచ పర్యాటక పటంలో తెలంగాణ!

Share

ప్రపంచ పర్యాటక పటంలో తెలంగాణ!
• పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ‘టూరిజం పాలసీ 2025-30’
• ఎకో, టెంపుల్, మెడికల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి
• స్థానిక యువతకు ఉపాధి, పర్యాటకులకు మెరుగైన వసతులు
• ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు.

హైదరాబాద్, మహా:

తెలంగాణ అపారమైన సహజ, సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను ప్రపంచ పర్యాటక పటంలో అగ్రభాగాన నిలపడమే ప్రజా ప్రభుత్వ దృఢ సంకల్పమని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, దేశ విదేశాల నుంచి రాష్ట్రాన్ని సందర్శిస్తున్న పర్యాటకులకు ఆయన ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని చారిత్రక కట్టడాలు, దేవాలయాలు, అటవీ ప్రాంతాలు, వన్యప్రాణి అభయారణ్యాలు తెలంగాణ విశిష్టతను నలుదిశలా చాటుతున్నాయని ముఖ్యమంత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు
దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాలైన రామప్ప, వరంగల్, యాదాద్రి, భద్రాద్రి, అలంపూర్, మేడారంతో పాటు హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలను ప్రభుత్వం సమగ్రంగా అభివృద్ధి చేస్తోందని సీఎం తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు ‘తెలంగాణ టూరిజం పాలసీ 2025-30’ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ నూతన విధానం ద్వారా కొత్త ప్రాజెక్టులు, అడ్వెంచర్ టూరిజం, క్యారవాన్ పార్కులు, వే-సైడ్ అమినిటీస్‌తో పాటు ఎకో, టెంపుల్, మెడికల్, హెరిటేజ్ టూరిజం రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పిస్తున్నట్లు వివరించారు.
యువతకు ఉపాధి.. పర్యాటకులకు వసతులు
రాష్ట్రానికి విచ్చేసే పర్యాటకులకు మెరుగైన వసతులు, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటని రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. పర్యాటక రంగ అభివృద్ధిలో కేవలం ప్రభుత్వమే కాకుండా స్థానిక ప్రజలు, సంస్థలు, హోటళ్లు, ట్రావెల్ ఏజెన్సీలు, హస్తకళాకారుల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. మన వారసత్వ సంపదను, ప్రకృతిని కాపాడుకుంటూ స్థిరమైన పర్యాటక అభివృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి వచ్చే ప్రతి పర్యాటకుడికి స్వాగతం పలుకుతూ, తెలంగాణను గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా మార్చే ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సీఎం ఆకాంక్షించారు.