తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఢమాల్.
* పెట్టుబడులన్నీ విదేశాలకే.
* బీజేపీ నేత చీకోటి ప్రవీణ్.
హైదరాబాద్, మహా.
హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ రియల్ ఎస్టేట్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకుడు చీకోటి ప్రవీణ్ తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వందల సంఖ్యలో అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు పాల్గొన్న ఈ ప్రదర్శనలో ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుణ్యమా అని రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయిందని విమర్శించారు. తెలంగాణలో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పెట్టుబడిదారులంతా మొదట దుబాయ్ వైపు మళ్లారని, అయితే అక్కడ యుద్ధ వాతావరణం నెలకొనడంతో ఇప్పుడు జార్జియా దేశం వైపు తమ దృష్టిని సారిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
జార్జియాలోని టాప్ మోస్ట్ గ్రూప్ అయిన ‘అలయన్స్ గ్రూప్’ ద్వారా తన మిత్రులు ఇమ్రాన్ తదితరులు ఇక్కడ భారీ పెట్టుబడి అవకాశాలను అందిస్తున్నారని ప్రవీణ్ తెలిపారు. జార్జియాలో మారియట్ వంటి పెద్ద హోటళ్లపై భాగాల్లో స్టూడియో, వన్ బీహెచ్‌కే, టూ బీహెచ్‌కే అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తే, వాటిని హోటల్ గదులుగా మార్చి సదరు సంస్థలే స్వయంగా నిర్వహిస్తూ పెట్టుబడిదారులకు నెలవారీ ఆదాయాన్ని అందిస్తాయని ఆయన వివరించారు. హైదరాబాద్ మార్కెట్ బాగున్నప్పటికీ, ప్రభుత్వ విధానాల వల్ల బయటి వ్యక్తులు బాగుపడుతున్నారని, కానీ స్థానికులు మాత్రం ఇక్కడ ఏ కొనుగోలు చేయాలన్నా భయపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ‘హైడ్రా’ పేరుతో ప్రజలను భయపెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు ’22ఏ’ పేరుతో రియల్ ఎస్టేట్‌ను మరింత భయాందోళనలకు గురిచేస్తోందని మండిపడ్డారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా, ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన రాజపుష్ప, డీఎస్ఆర్, మై హోమ్ వంటి బడా సంస్థల స్టాల్స్ వద్ద ఒక్క కొనుగోలుదారుడు కూడా లేకపోవడాన్ని, కనీసం అడిగేవారు కూడా లేకపోవడాన్ని ఆయన ఎత్తిచూపారు. తెలంగాణలో ప్రజల వద్ద డబ్బున్నప్పటికీ, స్థానికంగా ఇన్వెస్ట్ చేయడానికి జనం జంకుతున్నారని స్పష్టం చేశారు. రేపు 22ఏ తీసేసి 44బీ తెస్తారో ఎవరికీ తెలియదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో తమ ఆస్తులను ఎక్కడ కూలగొడతారోనన్న భయం ప్రజల్లో నెలకొందని ప్రవీణ్ విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సైతం ఆయన విమర్శిస్తూ, కేటీఆర్ దెబ్బకు సగం పెంట్‌హౌస్‌లు బినామీల పేర్ల మీదికి పోయేవని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉన్న ఈ రాజకీయ మరియు పాలనాపరమైన అనిశ్చితి కారణం గానే ప్రజలు హైడ్రా, 22ఏ వంటి భయాలు లేని సురక్షిత ప్రాంతాలను వెతుక్కుంటున్నారని తెలిపారు. మంచి ఫ్లైట్ కనెక్టివిటీ, పెట్టుబడిపై మూడు నాలుగు రెట్ల అప్రిసియేషన్, స్థిరమైన అద్దె ఆదాయం ఉన్న జార్జియా లాంటి విదేశీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్ర ప్రజలు ఆసక్తి చూపుతున్నారని చీకోటి ప్రవీణ్ స్పష్టం చేశారు. తన మిత్రుడు ఏర్పాటు చేసిన స్టాల్‌ను సందర్శించడానికి మాత్రమే తాను ఈ ప్రదర్శనకు వచ్చినట్లు ఆయన వెల్లడించారు.







