- జిల్లా అభివృద్ధి కార్యక్రమాలే మాకు స్ఫూర్తిదాయకం
- మాల్దీవుల మహిళా అభివృద్ధి కమిటీ సభ్యుల ప్రశంస
వరంగల్, కలెక్టరేట్ మహా ;
మాల్దీవుల సిటీ కౌన్సిళ్లకు చెందిన మహిళా అభివృద్ధి కమిటీ సభ్యుల బృందం వరంగల్ జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించింది. హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి తో పాటు పంచాయతీరాజ్ సంస్థ (NIRDPR) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నాయకత్వ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా 30 మంది మహిళా సభ్యులు ఈ అధ్యయన పర్యటనలో పాల్గొన్నారు.
పర్యటనలో భాగంగా జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాలు చేపడుతున్న జీవనోపాధి కార్యక్రమాలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ, గ్రామ అభివృద్ధిలో పంచాయతీల పాత్ర, మహిళా సంఘాలు ప్రభుత్వ శాఖలతో సమన్వయంతో నిర్వహిస్తున్న కార్యక్రమాలను సభ్యులు పరిశీలించారు.
మొదటి రోజు గంగదేవిపల్లి గ్రామాన్ని సందర్శించిన బృందం గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించింది.
అనంతరం సెప్టెంబర్ 26న ముల్కనూరులోని స్వకృషి మహిళా డెయిరీని సందర్శించి, మహిళలు నిర్వహిస్తున్న వివిధ జీవనోపాధి కార్యక్రమాలు, డెయిరీ కార్యకలాపాలను పరిశీలించారు. మహిళలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకొని సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లాలో అమలు చేస్తున్న పలు ప్రభుత్వ కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని మాల్దీవుల మహిళా అభివృద్ధి కమిటీ సభ్యులు ప్రశంసించారు.
జిల్లా కలెక్టర్ తో సమావేశం
పర్యటనలో భాగంగా శనివారం జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ వై.వి. గణేష్‌తో మహిళా అభివృద్ధి కమిటీ సభ్యులు సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్ జిల్లా చారిత్రక నేపథ్యం, జిల్లా పరిపాలనా వ్యవస్థ, వివిధ శాఖల అధికారులు నిర్వహిస్తున్న పాత్ర, మహిళా సాధికారత కార్యక్రమాలు, కిశోర బాలికల వికాసం, పంచాయతీరాజ్ వ్యవస్థ పనితీరు, మహిళల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాల గురించి సభ్యులకు వివరించారు.
జిల్లాలో మహిళల ఆర్థిక సాధికారత, స్వయం సహాయక సంఘాల ద్వారా జీవనోపాధి అవకాశాల కల్పన, గ్రామీణాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యంపై జిల్లా కలెక్టర్ వివరించారు.
జిల్లా కలెక్టర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న మాల్దీవుల సిటీ కౌన్సిల్ సభ్యులు అభినందనలు తెలిపారు. వరంగల్ జిల్లాలో అన్ని రంగాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తమకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయని, ఇలాంటి కార్యక్రమాలను తమ దేశంలో కూడా అమలు చేసేందుకు ఈ పర్యటన ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ కే. నాగపద్మజ, NIRDPR కోర్సు డైరెక్టర్ డాక్టర్ అంజన్ కుమార్ భంజా, అసిస్టెంట్ ప్రొఫెసర్, అదనపు డీఆర్‌డీఓ శ్రీనివాస్, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎం. అనిల్ కుమార్, అరుణ్ రాజ్, కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.







