ట్యాంక్‌బండ్‌పై గణేశ్ నిమజ్జనం ఆంక్షలతో రణరంగం.
* బారికేడ్ల తొలగింపునకు ఉత్సవ సమితి యత్నం.
* ఉద్రిక్తత, తోపులాట.. శశిధర్ సహా పలువురు ప్రతినిధుల అరెస్టు.
* సర్కార్ తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం.. తక్షణ విడుదలకు డిమాండ్.
హైదరాబాద్, మహా:
రాజధాని హైదరాబాద్‌లో గణేశ్ విగ్రహాల నిమజ్జనం వ్యవహారం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల నిమజ్జనానికి అధికారులు విధించిన ఆంక్షలను నిరసిస్తూ భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి సోమవారం ఆందోళనకు దిగింది. నిమజ్జనానికి అనుమతి ఇవ్వాలంటూ ట్యాంక్‌బండ్ చుట్టూ అధికారులు ఏర్పాటు చేసిన భారీ ఇనుప బారికేడ్లను ఉత్సవ సమితి ప్రతినిధులు, కార్యకర్తలు తొలగించే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వారిని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో అప్రమత్తమైన పోలీసులు భారీగా మోహరించి, ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్‌తో పాటు పలువురు ముఖ్య నేతలను బలవంతంగా అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు.
ఈ పరిణామాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తున్న నిమజ్జనాన్ని ట్యాంక్‌బండ్‌పై అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేపట్టిన భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతల శశిధర్ సహా అరెస్టయిన ప్రతినిధులందరినీ బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సంప్రదాయం ప్రకారం ట్యాంక్‌బండ్‌పైనే గణనాథుల నిమజ్జనానికి పూర్తి అనుమతులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
మరోవైపు అధికారులు మాత్రం న్యాయస్థాన ఆదేశాలు, పర్యావరణ పరిరక్షణ నిబంధనల ప్రకారమే తాము వ్యవహరిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాల నిమజ్జనం వల్ల హుస్సేన్‌సాగర్ కాలుష్య కాసారంగా మారుతోందన్న కారణంతో గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి అనుమతి లేదంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు బారికేడ్లతో దారులను మూసివేసినట్లు తెలిపారు. నగరంలో హుస్సేన్‌సాగర్‌పై భారం తగ్గించేందుకు విభిన్న ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు ప్రత్యేకంగా కృత్రిమ నిమజ్జన కొలనులను సిద్ధం చేశారని, చిన్న, మధ్యస్థ విగ్రహాలను ఆ కొలనుల్లోనే నిమజ్జనం చేయాలని సూచిస్తున్నారు.
ఎప్పటిలాగే నిమజ్జనోత్సవాన్ని ట్యాంక్‌బండ్‌పై ఘనంగా నిర్వహించాలన్నది భక్తులు, ఉత్సవ నిర్వాహకుల పట్టుదల కాగా, కోర్టు ఆదేశాల మేరకు సాగర్ పరిరక్షణ తమ బాధ్యతని యంత్రాంగం చెబుతుండటంతో ఈ వివాదం రాజకీయం రంగు పులుముకుంటోంది. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, ఉత్సవ నిర్వాహకుల మధ్య ఏకాభిప్రాయం కుదిరితేనే ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి ప్రభుత్వం తుదిగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ భాగ్యనగరంలో నెలకొంది.







